Nepal: ప్రధానిగా దేవ్‌బా నియామకం

నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్‌బా (74) ఐదోసారి ఆ దేశ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 76(5) మేరకు నేపాల్‌ రాష్ట్రపతి విద్యాదేవి భండారీ ఈ ఉత్తర్వులు జారీ చేశారు....

Updated : 13 Jul 2021 20:23 IST

కాఠ్‌మాండూ: నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్‌బా (74) ఐదోసారి ఆ దేశ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 76(5) మేరకు నేపాల్‌ రాష్ట్రపతి విద్యాదేవి భండారీ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 30 రోజుల్లో దేవ్‌బా పార్లమెంట్‌లో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. దేవ్‌బా గతంలో నాలుగుసార్లు.. 2017 జూన్‌ నుంచి 2018 ఫిబ్రవరి వరకు, 2004 జూన్‌ - 2005 ఫిబ్రవరి, 2001 జులై - 2002 అక్టోబర్‌, 1995 సెప్టెంబర్‌ - 1997 మార్చి వరకు..  ప్రధానిగా విధులు నిర్వర్థించారు.

షేర్ బహదూర్ దేవ్‌బాను ప్రధానమంత్రిగా నియమించాలని ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రపతి బిద్యా దేవి భండారీని సోమవారమే ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి చోలేంద్ర షంషేర్‌ రాణా ఆధ్వర్యంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని కేపీ శర్మ ఓలి సిఫార్సు మేరకు ప్రతినిధుల సభను అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. జులై 18న ప్రతినిధుల సభ సమావేశాన్ని జరపాలని సూచించింది.

నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో వర్గ పోరు అధికమవడంతో ప్రధాని ఓలి గతేదాడి డిసెంబర్‌ 20న ప్రతినిధుల సభను రద్దు చేశారు. దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 23న సభను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో మళ్లీ ఓలినే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే పార్టీలో లుకలుకలు కొనసాగడంతో మే 22న రెండోసారి సభను రద్దు చేశారు. దీంతో 5 నెలల్లోనే రెండుసార్లు సభను రద్దు చేసినట్లయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని