‘వాళ్ల కాళ్లు విరగ్గొట్టండి.. నేను బెయిల్‌ ఇప్పిస్తా’

శివసేన పార్టీ హక్కులపై మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఠాక్రే వర్గాన్ని హెచ్చరిస్తూ శిందే

Updated : 16 Aug 2022 12:39 IST

ఠాక్రే వర్గంపై శిందే వర్గం ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు

ముంబయి: శివసేన పార్టీ హక్కులపై మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఠాక్రే వర్గాన్ని హెచ్చరిస్తూ శిందే వర్గం ఎమ్మెల్యే ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘మీకు అడ్డుపడితే వాళ్ల(ఠాక్రే వర్గాన్ని ఉద్దేశిస్తూ) కాళ్లు విరగ్గొట్టండి.. అవసరమైతే నేను  బెయిల్‌ ఇప్పిస్తా’’ అంటూ ఆ ఆమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి.

ముంబయిలోని మాగాఠణే ప్రాంతంలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆ ప్రాంత ఎమ్మెల్యే ప్రకాశ్‌ సుర్వే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శివసేనలో విభేదాల గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ఎవరిది నిజమైన శివసేన? దీని గురించి మీకు ఎవరైనా ఏమైనా చెబితే గట్టిగా జవాబు చెప్పండి. ఎవరి దాదాగిరీని సహించేది లేదు. అవసరమైతే వారిని కొట్టండి. మీకు ప్రకాశ్‌ సుర్వే ఉన్నాడు. వాళ్ల చేతులు విరగొట్టలేకపోతే కాళ్లు విరగ్గొట్టండి. ఆ తర్వాత రోజు నేనొచ్చి మీకు బెయిల్‌ ఇప్పిస్తా’’ అని కార్యకర్తలకు సూచించారు. తాము ఎవరి జోలికీ వెళ్లబోమని, కానీ తమ జోలికి ఎవరైనా వస్తే మాత్రం వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు.

ఇందుకు సంబంధించిన వీడియో స్థానిక మీడియాలో వైరల్‌గా మారడంతో ఠాక్రే వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే ప్రకాశ్‌ సుర్వేపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఠాక్రే వర్గంతో పాటు ప్రతిపక్ష ఎన్సీపీ నేడు మీడియా సమావేశం నిర్వహించనుంది. అటు సీఎం శిందే కూడా మీడియా ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల శివసేన పార్టీలో శిందే వర్గం తిరుగుబాటుతో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ కూటమి కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భాజపా మద్దతుతో శిందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే అప్పటి నుంచి శివసేన పార్టీ గుర్తు, నియంత్రణ హక్కులపై ఇరు వర్గాల మధ్య పోరు నెలకొంది. అసలైన శివసేన తమదేనంటూ శిందే వర్గం ఈసీని కోరగా.. ఠాక్రే వర్గం ఖండించింది. ఈ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు వద్ద పెండింగ్‌లో ఉంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని