మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్ ఉంటుందా..?

కరోనా వైరస్ మహారాష్ట్రను కలవరపెడుతోంది. లాక్‌డౌన్ విధిస్తారంటూ వార్తలు వస్తున్నాయి.

Published : 10 Mar 2021 13:33 IST

ముంబయి: కరోనా వైరస్ మహారాష్ట్రను కలవరపెడుతోంది. లాక్‌డౌన్ విధిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ విజృంభణను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ లేక కఠిన నిబంధనల గురించి శివసేన పార్టీ పత్రిక సామ్నా ముందస్తు హెచ్చరిక చేసింది. ప్రభుత్వం వైపు నుంచి చర్యలు వద్దనుకుంటే క్రమశిక్షణతో వ్యవహరించాలని తేల్చిచెప్పింది. లాక్‌డౌన్‌పై స్థానిక యంత్రాంగం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని మంత్రి అస్లామ్ షేక్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

‘మహారాష్ట్ర మరోసారి లాక్‌డౌన్ వైపునకు వెళ్తోందా? దేశవ్యాప్తంగా మరోసారి కరోనా ఉద్ధృతి ఎక్కువైంది. కొత్త కేసుల్లో అధికభాగం మహారాష్ట్రలోనే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు స్వీయ క్రమశిక్షణ పాటించాలి. లేకపోతే లాక్‌డౌన్ లేక కఠిన ఆంక్షలు తప్పవు’ అంటూ తన సంపాదకీయంలో సామ్నా రాసుకొచ్చింది. కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ, తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదంటూ ప్రధాని నరేంద్ర మోదీతో సహా భాజపా నేతలపై సామ్నాలో శివసేన మండిపడింది. ‘భాజపా పశ్చిమబెంగాల్‌లో తన జెండాను ఎగురవేయాలనుకుంటోంది. కనీసం ప్రధాని అయినా కొవిడ్ ప్రొటోకాల్‌ను పాటించాలి. ఆ రాష్ట్రంలో కొవిడ్ ముప్పు లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రధాన మంత్రి భారీ ర్యాలీలు, ఆ పార్టీ నాయకుల సందర్శనలు ముగిసేవరకు అక్కడ కరోనా ఉండదు’ అని ఎద్దేవా చేసింది.

కాగా, దీనిపై భాజపా స్పందించింది. మహారాష్ట్రలో కేసుల పెరుగుదలపై కేంద్రం ఆందోళనగా ఉందని వ్యాఖ్యానించింది. కొవిడ్ కట్టడికి మీరు ఏం చేయనున్నారంటూ అధికార పార్టీని ప్రశ్నించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని