Pune Porsche Accident: పుణె వైద్యుడి వెనుక పెద్ద నెట్‌వర్క్‌

మహారాష్ట్రలోని పుణెలో ఓ మైనరు (17) నిర్లక్ష్య డ్రైవింగు కారణంగా ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతిచెందిన కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి.

Published : 14 Jun 2024 05:48 IST

4 జిల్లాల్లో అజయ్‌ తావ్‌డే క్రిమినల్‌ రాకెట్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహారాష్ట్రలోని పుణెలో ఓ మైనరు (17) నిర్లక్ష్య డ్రైవింగు కారణంగా ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతిచెందిన కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో రక్త నమూనాల మార్పిడితో ఆధారాలు తారుమారు చేసిన డాక్టర్‌ అజయ్‌ తావ్‌డే వెనుక పెద్ద నెట్‌వర్క్‌ పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. దీంతో ససూన్‌ ఆస్పత్రిలోని ఫోరెన్సిక్‌ విభాగం పనితీరుపై నీలినీడలు కమ్ముకొంటున్నాయి. ఈ విభాగం అధిపతి అయిన డాక్టర్‌ అజయ్‌ తావ్‌డే గతంలోనూ పలు కేసుల్లో ఇలాగే రక్త నమూనాలు మార్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పుణె నేరవిభాగం  అధికారులు మీడియా ఎదుట ఈ విషయం వెల్లడించారు. తావ్‌డేకు  సంబంధించిన వైద్యులు, దళారుల నెట్‌వర్క్‌ పుణె చుట్టుపక్కల పశ్చిమ మహారాష్ట్రలోని నాలుగు జిల్లాల్లో విస్తరించినట్లు వారు తెలిపారు. ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉన్న కుటుంబాల వ్యక్తులు తాగి వాహనం నడిపినట్లు కేసు నమోదైతే.. ఈ నెట్‌వర్క్‌ వెంటనే ఆ కుటుంబాన్ని సంప్రదిస్తుంది. బేరం కుదిరాక రక్త నమూనాలు మార్చేసి.. దోషులకు స్వల్ప శిక్షలు పడేందుకు దోహదం చేస్తుంది. కేసునుబట్టి వీరు కనీసం రూ.5 లక్షల నుంచి వసూలు చేస్తారని చెబుతున్నారు.   

డాక్టర్‌ తావ్‌డే పేరు గతంలోనూ డ్రగ్స్‌ కేసులు, కిడ్నీ మార్పిడి రాకెట్‌ వంటి నేరాల్లో వినిపించింది. అయినా, అతడికి ప్రభుత్వ ఆసుపత్రి ఫోరెన్సిక్‌ విభాగానికి అధిపతిగా పదోన్నతి కల్పించారు. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతోనే ఇలా జరిగినట్లు తెలుస్తోంది. గత నెలలో ససూన్‌ ఆస్పత్రి డీన్‌ వినాయక్‌ కాలే మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర మంత్రి హసన్‌ ముష్రాఫ్, స్థానిక ఎమ్మెల్యే సునీల్‌ టింగ్రేల నుంచి ఓ లేఖ వచ్చిందని.. దానిలో తావ్‌డేను హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌ చేయాలని సూచించినట్లు వెల్లడించారు. ఈ ప్రకటన తర్వాత వినాయక్‌ కాలేను ప్రభుత్వం బలవంతపు సెలవుపై పంపించింది. వినాయక్‌ ప్రస్తావించిన ఇద్దరు నేతలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ వర్గానికి చెందినవారు. పుణెలో ప్రమాదం జరిగిన కొద్దిగంటల్లోనే యెరవడా పోలీస్‌ స్టేషన్‌ను ఎమ్మెల్యే సునీల్‌ సందర్శించడం విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన అష్ఫాక్‌ మకాన్‌దార్‌తో సునీల్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ‘విశాల్‌ (నిందితుడి తండ్రి)కు సాయం చెయ్యి’ అని ఎమ్మెల్యే చెప్పడంతోనే అతడు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. 


ఐటీ ఉద్యోగులు తాగి ఉన్నట్లు చూపించే ప్రయత్నం : మాజీ హోంమంత్రి

పుణె: మైనరు కారు నడిపి రెండు ప్రాణాలను బలిగొన్న పుణె రోడ్డు ప్రమాదం కేసులో ద్విచక్ర వాహనంపై వస్తూ మృతిచెందిన ఇద్దరు ఐటీ ఉద్యోగులు తాగి ఉన్నట్లు చూపించే ప్రయత్నం జరుగుతోందని మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ‘ఎక్స్‌’ ద్వారా ఆరోపణలు చేశారు. పుణె పోలీసు ఉన్నతాధికారులు వీటిని ఖండించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు