Shraddha Murder: జైల్లో రక్షణ లేదు.. బెయిల్ ఇవ్వండి: కోర్టుకెళ్లిన ఆఫ్తాబ్‌

శ్రద్ధా హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్‌ పూనావాలా బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. జైల్లో తనకు రక్షణ లేదని, బెయిల్‌ ఇవ్వాలని కోరడం గమనార్హం.

Published : 16 Dec 2022 18:06 IST

దిల్లీ: సంచలనం సృష్టించిన కాల్ సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ (Shraddha Walkar) హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్‌ పూనావాలా (Aaftab Poonawala) బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించాడు. జైల్లో తనకు భద్రత లేదని, బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై దిల్లీ సాకేత్‌ కోర్టు శనివారం (డిసెంబరు 17న) విచారణ చేపట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆఫ్తాబ్‌ జ్యుడిషియల్‌ కస్టడీని ఇటీవల న్యాయస్థానం డిసెంబరు 23 వరకు పొడిగించింది. ప్రస్తుతం అతడు తిహాడ్‌ జైల్లో ఉన్నాడు.

తన సహజీవన భాగస్వామి అయిన శ్రద్ధా వాకర్‌ను చంపి, ఆమె శరీరాన్ని అతి దారుణంగా ముక్కలు చేసిన ఆఫ్తాబ్‌ను దిల్లీ పోలీసులు గత నెల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటికే నిందితుడికి పాలిగ్రాఫ్‌, నార్కో పరీక్షలు కూడా చేశారు. ఆఫ్తాబ్‌ చెప్పిన వివరాల ఆధారంగా.. మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మానవ అవశేషాలను గుర్తించారు. ఆ శరీర భాగాలు శ్రద్ధావేనని డీఎన్‌ఏ పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. ఇక నిందితుడి ఇంట్లో గుర్తించిన రక్తం నమూనాలు కూడా మృతురాలివేనని నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు.

శ్రద్ధా హత్య కేసులో పోలీసులు ఇంకా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయలేదు. ప్రస్తుతానికి నిందితుడిని జ్యుడిషియల్‌ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో పోలీసుల తరఫున వాదించేందుకు ఇద్దరు ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లను నియమిస్తూ దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్‌జీ) వీకే సక్సేనా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎల్‌జీ కార్యాలయ అధికారులు గురువారం వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు