Kapil Sibal: మన పోరాటం మనదే.. విదేశాల ఆమోదం అవసరం లేదు..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) అనర్హత వేటుపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబల్ తప్పుపట్టారు. 

Updated : 31 Mar 2023 14:07 IST

దిల్లీ: గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు(Rahul Gandhi Disqualification) చర్చనీయాశంగా మారింది. దీనిపై అమెరికా, జర్మనీ వంటి దేశాలు తమ అభిప్రాయాలు తెలియజేశాయి. ఈ క్రమంలో జర్మనీ స్పందనకు కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌ సింగ్(Digvijaya Singh) కృతజ్ఞతలు తెలియజేయడాన్నికేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌(Kapil Sibal) ఆక్షేపించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

‘భారత్‌లో రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి జైలు శిక్ష.. ఆ తీర్పు కారణంగా ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దవ్వడం వంటి అంశాలను మేం గమనిస్తున్నాం. ఈ కేసులో ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయి. తీర్పుపై ఆయన అప్పీల్‌ చేసుకోవచ్చు’ అని జర్మనీ పేర్కొంది. దీనిపై దిగ్విజయ్ స్పందిస్తూ.. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎలా అణగదొక్కుతున్నారో రాహుల్‌గాంధీ ఉదంతం ద్వారా రుజువు కావడాన్ని పరిగణనలోకి తీసుకున్నందుకు ట్విటర్లో ధన్యవాదాలు చెప్పారు. దాంతో కేంద్ర మంత్రులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిగ్విజయ్‌ సింగ్ మాటలను కపిల్ సిబల్ తప్పుపట్టారు. ‘జర్మనీ స్పందనపై దిగ్విజయ్ కృతజ్ఞతలు తెలియజేశారు. మనం ముందుకు వెళ్లడానికి మనకు అండదండలు అవసరం లేదని నేను భావిస్తున్నాను. విదేశాల నుంచి మనకు ఆమోదం అవసరం లేదు. మన పోరాటం మనదే ’ అని సిబల్‌ అన్నారు.

కపిల్‌ సిబల్‌ గత ఏడాది కాంగ్రెస్‌ను వీడారు. సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభలో అడుగుపెట్టారు.  గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన.. భాజపా ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు ‘ఇన్సాఫ్‌’ (Insaaf) పేరిట వేదికను స్థాపించారు. ప్రజల కోసం ‘ఇన్సాప్ కే సిపాయి’పేరిట వెబ్‌సైట్‌ను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఇదిలా ఉంటే పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి గుజరాత్‌లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ వెంటనే పార్లమెంట్ ఆయన సభ్యత్వంపై అనర్హత వేటు వేసింది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని