Karnataka: సిద్ధరామయ్య జోరు.. గంటల వ్యవధిలోనే ఆ 5 హామీలకు ఆమోదం

కర్ణాటక ముఖ్యమంత్రిగా (Karnataka CM Siddaramaiah) ప్రమాణస్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే సిద్ధరామయ్య ఎన్నికల సమయంలో ఇచ్చిన 5 ప్రధాన హామీల అమలుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. 

Published : 20 May 2023 20:40 IST

బెంగళూరు: తీవ్ర చర్చోపచర్చల తర్వాత కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.  సిద్ధరామయ్య (Siddaramaiah) 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ (DK Shivakumar) ప్రమాణం చేయగా.. తొలి విడతగా 8 మందిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం నిర్వహించిన తొలి కేబినెట్‌ సమావేశంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 5 ప్రధాన హామీలను నెరవేర్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ప్రజల అభీష్టం మేరకు పాలన సాగిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే హామీల అమలు దిశగా ముందుకెళ్లడం కేవలం కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే చెల్లుతుందని ఆయన అన్నారు.

ఆ ఐదు హామీలు ఇవే..

  • గృహజ్యోతి పథకం పేరిట.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌.
  • గృహ లక్ష్మి పథకం కింద.. కుటుంబంలోని మహిళా పెద్దకు ప్రతి నెలా రూ.2000 ఆర్థిక సాయం.
  • అన్న భాగ్య పథకం పేరుతో.. దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న కుటుంబాల్లోని ప్రతి సభ్యుడికీ నెలకు 10 కేజీల ఉచిత బియ్యం.
  • యువనిధి పథకం పేరిట.. రాష్ట్రంలోని నిరుద్యోగ పట్టభద్రులకు రెండేళ్లపాటు  ప్రతినెలా రూ.3,000 ఆర్థిక సాయం. అలాగే.. 18 -25 మధ్య వయస్సు ఉండి డిప్లమో పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు రూ.1,500 ఆర్థిక సాయం.
  • శక్తి పథకం కింద.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత ప్రజా రవాణా సదుపాయం.

ఈ ఐదు హామీలతోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి ఒక్క హామీనీ రానున్న ఐదేళ్లలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ప్రజల ఆశీస్సుల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఈ విజయం అగ్రనేత రాహుల్‌ గాంధీకే చెల్లుతుందని, రాష్ట్రంలో భారత్‌ జోడో యాత్ర చేపట్టినప్పటి నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినట్లయిందని అన్నారు. ప్రచారంలో భాగస్వాములైన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ గతంలో మేం ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాం.. భవిష్యత్‌లోనూ అదే కొనసాగిస్తాం’’ అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.  అంతకుముందు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ప్రమాణస్వీకారం తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చుతాయని అన్నారు.

సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు

సోమవారం నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు కర్ణాటక నూతన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. తాజా ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలోనే ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు. స్పీకర్‌ ఎన్నిక కూడా అప్పుడే ఉంటుందని అన్నారు. ‘‘ సోమవారం నుంచి 3 రోజులపాటు అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించాం. మే 24వ తేదీ లోపల నూతన ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉన్నందున అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సిందిగా గవర్నర్‌కు కూడా ఆహ్వానం పంపాం. సీనియర్‌ ఎమ్మెల్యే ఆర్‌.వి. దేశ్‌పాండేను ప్రొటెం స్పీకర్‌గా ఉండాలని అభ్యర్థించాం’’ అని సిద్ధరామయ్య తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని