Sidhu Moose Wala: వారి పేర్లు ఎందుకు బయటకు వచ్చాయి?.. నివేదిక కోరిన పంజాబ్‌ హరియాణా హైకోర్టు!

పంజాబీ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసు రాజకీయంగా దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. పోలీసు భద్రతను కుదించడంతోనే ఈ ఘటన జరిగినట్లు ఆప్‌ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే...

Published : 01 Jun 2022 02:34 IST

చండీగఢ్‌: పంజాబీ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసు రాజకీయంగా దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. పోలీసు భద్రతను కుదించడంతోనే ఈ ఘటన జరిగినట్లు ఆప్‌ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే.. భద్రతను ఉపసంహరించిన, కుదించిన వారి పేర్లు ఎందుకు బహిరంగంగా బయటకు వచ్చాయో చెప్పాలంటూ పంజాబ్, హరియాణా హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. భద్రత తగ్గింపుపై ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకున్నారో వివరించాలని జస్టిస్ రాజ్ మోహన్ సింగ్ ధర్మాసనం ఆదేశించింది. జూన్ 2లోగా సీల్డ్ కవర్‌లో పూర్తి నివేదిక సమర్పించాలని తెలిపింది.

తన భద్రతను జడ్‌- కేటగిరీ నుంచి తగ్గిస్తూ జారీ చేసిన మే 11 నాటి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఓపీ సోనీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ప్రస్తుతం విచారిస్తోంది. సోనీ సహా 184 మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను ఉపసంహరించారని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఎవరి ప్రాణాలకు ముప్పు ఉందో చూడకుండా.. ఎంపిక విధానంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే.. ఎవరి భద్రతను కుదించారో తదితర సున్నిత వివరాలను ప్రచారం చేయరాదని భారత అదనపు సొలిసిటర్ జనరల్ సత్యపాల్ జైన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

అంతకుముందు.. ఆప్‌ ప్రభుత్వం 424 మంది భద్రతను తగ్గించే నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో సంబంధిత పోస్టర్‌ను షేర్‌ చేసింది. అందులో మూసేవాలా పేరును పొందుపర్చడం గమనార్హం. పోలీసు భద్రతను తగ్గించిన మరుసటి రోజే మూసేవాలా హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ హత్య ఘటనపై విచారణకు హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం భగవంత్‌ మాన్‌ ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని