Sidhu Moose Wala: పోలీసులు నన్ను చంపేస్తారు.. కోర్టు మెట్లెక్కిన గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌!

తనను కాపాడాలంటూ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ కోర్టు మెట్లెక్కాడు. పంజాబ్‌ పోలీసులకు అప్పగించొద్దని......

Published : 31 May 2022 02:14 IST

దిల్లీ: ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య తమ పనేనని కెనడాలో నివసిస్తున్న గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌తో కలిసి తాము ఈ కుట్రపన్నిట్లు పేర్కొన్నాడు. అయితే గోల్డీబ్రార్‌ వ్యాఖ్యలను లారెన్స్‌ బిష్ణోయ్‌ కొట్టిపారేశాడు. ఈ హత్యలో తన ప్రమేయం లేదని పేర్కొన్నాడు. పలు కేసుల్లో తిహాడ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న లారెన్స్‌ బిష్ణోయ్‌.. తనను కాపాడాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. విచారణ కోసం తనను పంజాబ్‌ పోలీసులకు అప్పగించొద్దని పటియాలా న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఒకవేళ అప్పగిస్తే పోలీసులు తనను నకిలీ ఎన్‌కౌంటర్‌ చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపాడు. గోల్డీ ఆరోపణలను ఖండిస్తూ.. ఇంతటి భారీ హత్య కుట్రను జైలులో నుంచి ఎలా ప్లాన్‌ చేస్తారని లారెన్స్‌ తరఫున పిటిషన్‌ వేసిన న్యాయవాది ప్రశ్నించారు.

లారెన్స్ బిష్ణోయ్ దిల్లీ యూనివర్సిటీ మాజీ విద్యార్థి నాయకుడు. బిష్ణోయ్‌కి గోల్డీబ్రార్‌ అత్యంత సన్నిహితుడు. వీరు పంజాబ్‌లో వసూళ్ల దందాను నడుపుతుండేవారు. దేశ రాజధాని దిల్లీ, పంజాబ్‌, హరియాణాల్లోనూ లారెన్స్‌ కార్యకలాపాలు నిర్వహించాడు. కాగా పలు కేసుల్లో లారెన్స్‌ అరెస్టై తీహాడ్‌ జైల్లో ఉన్నాడు. అనంతరం కెనడాకు పారిపోయిన గోల్డీబ్రార్‌ అక్కడి నుంచే తమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం. గ్యాంగ్‌స్టర్‌ గొడవలు, హత్యల కారణంగానే తాజాగా సిద్ధూ మూసేవాలా హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని