Sidhu Moose Wala: ది లాస్ట్‌ రైడ్‌.. మరణాన్ని ముందుగానే ఊహించి..?

యువతలో క్రేజ్‌ సొంతం చేసుకున్న సిద్ధూ మూసేవాలా తన మరణాన్ని ముందుగానే ఊహించారని అభిమానులు పేర్కొంటున్నారు.

Published : 30 May 2022 02:32 IST

చివరి పాటను గుర్తుచేసుకుంటున్న అభిమానులు

దిల్లీ: పంజాబీ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా హత్యకు గురికావడం ఆయన అభిమానులను ఎంతగానో కలచివేస్తోంది. అయితే, యువతలో క్రేజ్‌ సొంతం చేసుకున్న సిద్ధూ మూసేవాలా తన మరణాన్ని ముందుగానే ఊహించారని అభిమానులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన తీసిన చివరి పాటను గుర్తు చేసుకుంటున్నారు. ఇటీవల విడుదల చేసిన ఓ పాటలో మరణం గురించి మూసేవాలా చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటూ తన సొంత మరణాన్ని మూసేవాలా ముందుగానే ఊహించుకొన్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గాయకుడి నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన మూసేవాలా ‘ది లాస్ట్‌ రైడ్‌’ (The Last Ride) పేరుతో గతనెల ఓ పాటను విడుదల చేశారు. ఇదే ఆయన చివరిపాట కావడం గమనార్హం. అయితే, అందులో మరణం గురించి ప్రస్తావించడాన్ని గుర్తుచేసుకుంటున్న అభిమానులు.. ఇదే ‘మీ అంతిమయాత్ర’ అవుతుందని అనుకోలేదని వాపోతున్నారు. మా సోదరుడు ఆయన మరణాన్ని ముందుగానే ఊహించారు అని  ఓ అభిమాని పేర్కొన్నాడు. ఈ పాట ఆయనకే అంకితం చేసుకున్నారు.. కానీ, ఆయన త్వరలోనే చనిపోతారన్న విషయం ఆయనకు తెలియదు. అయినా ఆయన మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాడంటూ మరో అభిమాని చెప్పుకొచ్చాడు.

మరోవైపు తన పాటల్లో ఎక్కువగా గన్‌ కల్చర్‌, గ్యాంగ్‌స్టర్లు వంటి హింసను ప్రేరేపించేవి చూపించే వివాదాస్పద గాయకుడిగా నిలిచాడు. పంజ్‌ గోలియన్‌ (Five Bullets) అనే పాటలోనూ ఇటువంటివి చూపించారనే అభియోగాలతో ఆయనపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదయ్యింది. మరోవైపు కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనూ ఫైరింగ్‌ రేంజ్‌లో ఏకే-47 రైఫిల్‌ని ఉపయోగించినందుకు ఆయనపై కేసు నమోదైంది. దిల్లీలో జరిగిన రైతు వ్యతిరేక ఉద్యమంలోనూ మూసేవాలా పాల్గొన్నారు. లెజెండ్‌, డెవిల్‌, జస్ట్‌ లిజన్‌, బ్రౌన్‌ బాయ్స్‌, హత్యార్‌, టిబేయాన్‌ దా పుట్‌, జట్‌ ద ముఖాబులా వంటి పంజాబీ పాటలు మూసేవాలాకు ఎంతోపేరు తెచ్చిపెట్టాయి.

ఇదిలాఉంటే, కాంగ్రెస్‌ నేత మూసేవాలా ఇద్దరు స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని గ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను తుపాకీతో కాల్చిచంపారు. ఈ ఘటనలో మిగతా ఇద్దరికి గాయాలయ్యాయి. వీఐపీ సంస్కృతికి తెరదించుతూ రాష్ట్రంలోని ప్రముఖులకు కేటాయించిన పోలీసు భద్రతను ప్రభుత్వం ఉపసంహరించిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. అయితే, ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు