Navjot Sidhu: ప్రత్యేక ఆహార వాదన! సిద్ధూను ఆసుపత్రికి తరలించిన జైలు అధికారులు

మూడు దశాబ్దాల క్రితం నాటి కేసులో పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూ ప్రస్తుతం పటియాలా సెంట్రల్‌ జైలులో కారాగార శిక్ష అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైద్య పరీక్షల నిమిత్తం సోమవారం ఉదయం ఆయన్ను...

Published : 23 May 2022 14:02 IST

చండీగఢ్‌: మూడు దశాబ్దాల క్రితం నాటి కేసులో పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూ ప్రస్తుతం పటియాలా సెంట్రల్‌ జైలులో కారాగార శిక్ష అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైద్య పరీక్షల నిమిత్తం సోమవారం ఉదయం ఆయన్ను భారీ భద్రత నడుమ పటియాలాలోని రాజీంద్ర ఆసుపత్రికి తరలించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సిద్ధూకు ప్రత్యేక ఆహారం అందించాలని ఆయన తరఫు లాయర్‌ హెచ్‌పీఎస్‌ వర్మ ఇటీవల పటియాలా కోర్టులో అప్పీల్‌ చేశారు. ఈ క్రమంలోనే వైద్యుల బోర్డు ఆయనకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వర్మ చెప్పారు. ఎటువంటి ప్రత్యేక ఆహారం అవసరమో బోర్డు చూస్తుందన్నారు. అనంతరం సంబంధిత నివేదికను స్థానిక చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సమర్పిస్తుందని తెలిపారు.

గత శుక్రవారం సాయంత్రం సిద్ధూను పటియాలా జైలుకు తరలించారు. అదే రోజు రాత్రి రోటి, పప్పు వడ్డించగా.. గోధుమల అలర్జీ, ఇతర ఆరోగ్య కారణాల రీత్యా ఆయన వాటిని తిరస్కరించారు. రక్తం గడ్డకట్టడం, కాలేయ వ్యాధి తదితర అనారోగ్య సమస్యలతోనూ ఆయన బాధపడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని జైలు అధికారులు ఆయనకు అనువైన ఆహారాన్ని సమకూర్చడం లేదని వర్మ ఆరోపించారు. ఇదే విషయమై శనివారం పటియాలా కోర్టులో అప్పీల్‌ చేశారు. మరోవైపు.. సిద్ధూను ఆసుపత్రికి తీసుకొచ్చారన్న విషయం తెలుసుకుని పలువురు మద్దతుదారులు అక్కడికి చేరుకున్నారు. 34 ఏళ్ల క్రితం ఓ వృద్ధుడిపై దాడి చేసి ఆయన మరణానికి కారణమైన కేసులో సిద్ధూకు ఇటీవల సుప్రీం కోర్టు ఏడాది జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని