Sikkim: ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే సీఎం సతీమణి రాజీనామా

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే సిక్కిం సీఎం సతీమణి కృష్ణకుమారి రాయ్ తన పదవికి రాజీనామా చేశారు.

Updated : 14 Jun 2024 12:17 IST

గాంగ్‌టక్‌: సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్(Prem Singh Tamang) సతీమణి కృష్ణ కుమారి రాయ్(Krishna Kumari Rai) ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజు పదవికి రాజీనామా చేశారు. దానిని స్పీకర్ ఎంఎన్ షెర్పా ఆమోదించినట్లు అసెంబ్లీ కార్యదర్శి లలిత్ కుమార్ గురుంగ్ గురువారం ధ్రువీకరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె నామ్చి-సింగితాంగ్(Namchi-Singhithang) నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించారు.

ఈ విషయంపై ఫేస్‌బుక్‌లో స్పందించిన సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ ‘‘నా జీవిత భాగస్వామి ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించింది. (సిక్కిం క్రాంతికారి మోర్చా) ఎస్‌కేఎం పార్టీ పార్లమెంటరీ కమిటీ అభ్యర్థన మేరకు ఆమె ఎన్నికల్లో పోటీ చేసింది. సభ్యుల ఏకగ్రీవ నిర్ణయంతో ఆమె తన పదవి నుంచి వైదొలగినట్లు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. ఆమె మాకు ఇచ్చిన మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని తెలిపారు.

ఈ ఎన్నికల్లో 07-సోరెంగ్-చకుంగ్(Soreng-Chakung), 19-రెనోక్‌(Rhenock) నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ విజయం సాధించారు. దీంతో సోరెంగ్-చకుంగ్ స్థానానికి రాజీనామా చేశారు.  

ఎన్నికల నియమావళి 1961 సెక్షన్ 67/A ప్రకారం రెండు స్థానాల్లో పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు ఫలితాలు ప్రకటించిన 14 రోజులలోపు ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు