Anurag Thakur: ‘కాంగ్రెస్‌ అధ్యక్షురాలి మౌనం వారి ఉద్దేశాన్ని తెలియజేస్తోంది’

ప్రధాని నరేంద్ర మోదీకి పంజాబ్‌ పర్యటనలో ఏర్పడ్డ భద్రతా లోపంపై కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కాంగ్రెస్‌పై మండిపడ్డారు......

Published : 07 Jan 2022 22:25 IST

సదిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి పంజాబ్‌ పర్యటనలో ఏర్పడ్డ భద్రతాలోపంపై కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఈ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సహా ప్రధాన నేతలంతా ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ ఘటనత వారి ‘ఉద్దేశం’ ఏంటో తెలిసిపోతోందని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రంలో దేశ ప్రధానికి భద్రత కల్పించలేకపోవడంపై ఆయన ప్రశ్నించారు.

ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఓ రాష్ట్ర ప్రభుత్వం దేశ ప్రధానికే భద్రత ఇవ్వలేకపోయింది. ప్రజలు చాలా తెలివైనవారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా రాహుల్ గాంధీ జీ, ప్రియాంక గాంధీతోపాటు ఇతర ముఖ్య నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారో వారు అర్థం చేసుకున్నారు’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రధాని భద్రతా లోపం వెనుక ఉన్న కారణం ఏంటి? అలా ఎందుకు జరిగింది? ఇది ప్లాన్‌ ప్రకారం జరిగిందా? లేక ప్రభుత్వం నిద్రపోతోందా?’ అని అనురాగ్‌ ఠాకూర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలంతా మౌనంగా ఉండడం వెనుక గల కారణం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది అని పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్‌ చేశారు.

మరోవైపు ప్రధానికి భద్రతా లోపం విషయాన్ని ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా తీసుకుంది. మోదీ పర్యటనకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పంజాబ్, హరియాణా హైకోర్టు రిజస్ట్రార్ జనరల్‌కు సూచించింది. ఈ విషయంలో పంజాబ్‌ పోలీసు, ఎస్‌పీజీ, ఇతర కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు సహకరించాలని వెల్లడించింది. ప్రధాని భద్రతకు భంగం వాటిల్లిందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై కేంద్రం, పంజాబ్ ప్రభుత్వం తమ వాదనలు వినిపించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని