Zomato: జొమాటో ప్రకటన వివాదం.. హృతిక్‌ రోషన్‌ నటించిన ఆ యాడ్‌ తొలగింపు

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ రూపొందించిన ఓ ప్రకటన వివాదాస్పదమయ్యింది. బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ నటించిన ఓ యాడ్‌ను.......

Published : 22 Aug 2022 01:43 IST

దిల్లీ: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో రూపొందించిన ఓ ప్రకటన వివాదాస్పదమైంది. బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ నటించిన ఓ యాడ్‌ను పూజారులు వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గిన జొమాటో దాన్ని తొలగించింది. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని, క్షమించాలని కోరుతూ ఆ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

‘మహాకాళ్‌’ నుంచి జొమాటోలో ‘థాలి’ని తెప్పించుకొని తినేస్తా.. అని హృతిక్‌ రోషన్‌ చెప్పే ఓ ప్రకటనను ఆ సంస్థ కొద్దిరోజుల క్రితం విడుదల చేసింది. అయితే యాడ్‌లో ‘మహాకాళ్‌’ పదాన్ని వినియోగించడంపై మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయ పూజారులు వ్యతిరేకించారు. అది ఓ వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై ఉజ్జయిని కలెక్టర్‌, మహాకాళ్‌ ఆలయ ఛైర్మన్‌ ఆశిష్‌ సింగ్‌కు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిపారు.

ఈ యాడ్‌పై వివాదం చెలరేగిన నేపథ్యంలో జొమాటో స్పందించింది. ఆ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అయితే, ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని, మహాకాళ్‌ ఉజ్జయినిలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌ పేరు అని పేర్కొంది. దాన్ని ఉద్దేశించే ఆ యాడ్‌ను రూపొందించినట్లు తెలిపింది. పాన్ ఇండియా ప్రచారంలో భాగంగా ప్రతి నగరంలోని జనాదరణ పొందిన లోకల్ రెస్టారెంట్లు, వాటి ఉత్తమ వంటకాలను గుర్తించామని.. మహాకాళ్‌ రెస్టారెంట్‌లో లభించే ‘థాలి’ని ఉద్దేశించి ఆ యాడ్‌ను రూపొందించినట్లు వివరణ ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని