Supreme Court: భారత ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌లో సింగపూర్‌ సీజేఐ

సుప్రీంకోర్టులో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ బెంచ్‌లో సింగ్‌పూర్‌ సీజేఐ భాగస్వామ్యమయ్యారు. ఫిబ్రవరి 4న జరిగే ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన.. శుక్రవారం భారత సుప్రీంకోర్టుకు విచ్చేశారు.

Published : 03 Feb 2023 17:28 IST

దిల్లీ: భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court)లో నేడు అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనంలో సింగపూర్‌ చీఫ్‌ జస్టిస్‌ సుందరేశ్‌ మేనన్‌ భాగస్వామి అయ్యారు. సింగపూర్‌ నాలుగో ప్రధాన న్యాయమూర్తిగా 2012లో బాధ్యతలు చేపట్టిన మేనన్‌.. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. భారత సుప్రీంకోర్టు 73వ వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు భారత్‌ చేరుకున్న ఆయన.. శనివారం జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ‘మారుతోన్న ప్రపంచంలో న్యాయవ్యవస్థ పాత్ర’ అంశంపై  జస్టిస్‌ సుందరేశ్‌ మేనన్‌ ప్రసంగించనున్నారు.

ఇదిలా ఉండగా.. గణతంత్ర దేశంగా అవతరించిన రెండు రోజులకు 1950 జనవరి 28వ తేదీన భారత సుప్రీం కోర్టు ఉనికిలోకి వచ్చింది. అయితే, సుప్రీంకోర్టు వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించే సంప్రదాయం ప్రారంభించాలనేది సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్ ఆలోచన అని కోర్టు వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగానే తొలిసారి ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే, మారుతోన్న ప్రపంచంలో న్యాయవ్యవస్థ ఎలా పనిచేస్తుందో దేశవాసులకు చూపాలన్న ఆలోచనతోనే సీజేఐ ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించినట్లు సుప్రీంకోర్టు వర్గాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమానికి భారత సంతతి వ్యక్తి, సింగపూర్ చీఫ్‌ జస్టిస్ సుందరేశ్‌ మేనన్‌ను ఆహ్వానించినట్లు తెలిపాయి. పౌరులు, ముఖ్యంగా యువతరం దేశ న్యాయవ్యవస్థ గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి పెంచేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు సమాచారం. మరోవైపు సుప్రీం కోర్టు ఇప్పటికే ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని