టీకా రికార్డ్‌: 24గంటల్లో 20లక్షల డోసులు పంపిణీ!

భారత్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నిత్యం లక్షల డోసులను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. తాజాగా 24గంటల వ్యవధిలో అత్యధికంగా 20లక్షల 19వేల డోసులను పంపిణీ చేసింది.

Published : 09 Mar 2021 15:12 IST

దిల్లీ: భారత్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నిత్యం లక్షల డోసులను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. తాజాగా 24గంటల వ్యవధిలో అత్యధికంగా 20లక్షల 19వేల డోసులను పంపిణీ చేసింది. టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒకేరోజు ఈస్థాయిలో కొవిడ్‌ డోసులు అందించడం ఇదే ప్రథమం. దీంతో ఇప్పటివరకు 2కోట్ల 30లక్షల డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

జనవరి 16న దేశంలో కొవిడ్‌ టీకాను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం, తొలి దశలో దాదాపు కోటి మంది కరోనా యోధులకు టీకాను అందించింది. మార్చి ఒకటో తేదీ నుంచి రెండో దశలో భాగంగా 60ఏళ్లు పైబడినవారికి టీకా అందిస్తోంది. జులై నాటికి దాదాపు 30కోట్ల మందికి టీకా ఇచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు కొవిడ్‌ టీకా తీసుకున్న వారిలో కోటి 89లక్షల మందికి తొలి డోసు అందించగా, మరో 40లక్షల 65వేల మందికి రెండు డోసులు ఇచ్చారు. దేశంలో అత్యధికంగా రాజస్థాన్‌లో ఇప్పటివరకు 23లక్షల డోసులను అందించగా, గుజరాత్‌, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో 19లక్షల చొప్పున కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులను అందించారు.

ప్రపంచవ్యాప్తంగా 31కోట్ల డోసులు..

కొవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 116దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. వీటి ద్వారా ఇప్పటివరకు 31.2కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిత్యం దాదాపు 80లక్షల డోసుల పంపిణీ జరుగుతోంది. కొవిడ్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తోన్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడ 9కోట్ల 20లక్షల డోసులను పంపిణీ చేశారు. చైనాలో 5కోట్లు, ఈయూలో 4కోట్లు, బ్రిటన్‌లో 2.3కోట్ల డోసులను అందించినట్లు సమాచారం. తర్వాతి స్థానంలో ఉన్న భారత్ కాస్త ఆలస్యంగా టీకా పంపిణీ ప్రారంభించినప్పటికీ‌ ఇప్పటివరకు 2కోట్ల 30లక్షల డోసులను అందించింది. ఇదిలాఉంటే, భారత్‌లో కొవాగ్జిన్‌, ఆస్ట్రాజెనెకా రెండు టీకాలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు