Published : 25 Jun 2021 01:14 IST

Vaccines: సింగిల్‌ డోసుతో 60శాతం రక్షణ!

లాన్సెట్‌ జర్నల్‌లో అధ్యయన ఫలితాలు

వాషింగ్టన్‌: యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే, వైరస్‌ను నిరోధించడంలో ఈ వ్యాక్సిన్లు ఏమేరకు సమర్థత చూపిస్తున్నాయో తెలుసుకునేందుకు అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా లండన్‌ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో.. ఫైజర్‌, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్లు ఒక్క డోసుతోనే 60శాతం రక్షణ కల్పిస్తున్నట్లు తేలింది. ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ ‘ది లాన్సెట్‌’లో ఈ అధ్యయన నివేదిక ప్రచురితమైంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వాటి వాస్తవ సామర్థ్యం, రోగనిరోధకత, వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో ఆయా టీకాల ప్రభావాన్ని తెలుసుకునేందుకు యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ నిపుణులు అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా బ్రిటన్‌ సంరక్షణ కేంద్రాల్లో ఉన్న 65 ఏళ్లకు పైబడిన 10వేల మంది వృద్ధుల సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. వీరిలో 9వేల మంది (88శాతం) ఫైజర్‌  లేదా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ను కనీసం ఒకడోసు తీసుకున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత 0-6రోజులు, 7-13రోజులు, 14 నుంచి 20రోజులు.. ఇలా పలు దఫాలుగా వారిలో ఇన్‌ఫెక్షన్‌ మూలాలను తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించారు. ఈ సమాచారాన్ని వ్యాక్సిన్‌ తీసుకోనివారి సమాచారంతో పోల్చి చూశారు. వ్యాక్సిన్‌ తీసుకున్న 28రోజుల తర్వాత వారిలో వైరస్‌ బారినపడే ముప్పు 56శాతం తగ్గగా, 35-48 రోజుల తర్వాత ఈ ముప్పు 60 శాతానికి తగ్గినట్లు నిపుణులు గుర్తించారు.

డోసుల మధ్య వ్యవధిని పెంచవచ్చు

ఫైజర్‌ లేదా ఆస్ట్రాజెనికా టీకా సింగిల్‌ డోసు తీసుకున్న వృద్ధులు వైరస్‌ బారినపడే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలిందని పరిశోధకులు స్పష్టం చేశారు. ముఖ్యంగా వ్యాక్సిన్‌ తొలిడోసు తీసుకున్నాక 4నుంచి 7వారాల వరకు రక్షణ ఉంటుందని చెప్పారు. రెండు డోసుల మధ్య గడువును మూడువారాల కంటే ఎక్కువగా పెంచేందుకు తాజా ఫలితాలను రుజువుగా చూపవచ్చన్నారు. అంతేకాకుండా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలోనూ వ్యాక్సినేషన్‌ కీలక పాత్ర పోషిస్తోందని ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే, వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో రెండో డోసు ప్రభావాన్ని అంచనా వేయడానికి మరిన్ని అధ్యయనాలు జరగాల్సి ఉందన్నారు. సుదీర్ఘ కాలం సంరక్షణ కేంద్రాల్లో ఉండే వృద్ధులకు వ్యాక్సిన్‌ అందించే విధానంలో మార్పుల కోసం తాజా అధ్యయన ఫలితాలు దోహదం చేస్తాయని కూడా పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉంటే, వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు భావిస్తోన్న డెల్టా, కప్పా వేరియంట్లపై ఆస్ట్రాజెనికా, ఫైజర్‌ టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఆక్స్‌ఫర్డ్‌ నిపుణుల అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా ఈ రెండు టీకాలను మిశ్రమ పద్ధతిలో ఇచ్చి ప్రయోగాలు జరుపుతున్నారు. ఇక సింగిల్‌ డోసు విధానంలో అందుబాటులోకి వచ్చిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా 66శాతానికి పైగా సమర్థత చూపించగా, తీవ్రమైన కేసుల్లో 76శాతం ప్రభావశీలత చూపినట్లు తేలింది. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చేరే ప్రమాదం నుంచి ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టీకాలన్నీ 100శాతం రక్షణ కల్పిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts