Manish Sisodia: భార్యకు అనారోగ్యం.. కొడుకు విదేశాల్లో.. బెయిల్‌ ఇవ్వండి: సిసోదియా

మద్యం కుంభకోణం కేసు (Delhi excise policy scam)లో బెయిల్‌ కోరుతూ మనీశ్ సిసోదియా (Manish Sisodia) చేసుకున్న అభ్యర్థనపై సీబీఐ మరోసారి వ్యతిరేకించింది. దీంతో ఈ విచారణ మళ్లీ వాయిదా పడింది.

Updated : 21 Mar 2023 17:47 IST

దిల్లీ: మద్యం కుంభకోణం (Delhi excise policy scam) కేసులో అరెస్టయిన దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోదియా (Manish Sisodia)కు ఈ కేసు నుంచి ఇప్పుడప్పుడే ఊరట లభించేలా లేదు. ఈ కేసులో సిసోదియా బెయిల్‌ పిటిషన్‌ (Bail Plea)పై దిల్లీ కోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సిసోదియా తరఫున న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఆయన విచారణకు సహకరిస్తున్నారని, కస్టోడియల్‌ విచారణ అవసరం లేదని కోర్టుకు తెలిపారు.

‘‘ఈ కేసులో సిసోదియా (Manish Sisodia) ముడుపులు తీసుకున్నట్లు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. సోదాల్లోనూ ఆయనకు వ్యతిరేకంగా ఏమీ లభించలేదు. ఆయనో ప్రజాప్రతినిధి. విచారణకు సహకరిస్తున్నారు. విదేశాలకు పారిపోయే ముప్పు లేదు. అందువల్ల ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి అవసరం లేదు. ఇక ఆయన సతీమణి అనారోగ్యంతో బాధపడుతున్నారు. సిసోదియా కుమారుడు విదేశాల్లో చదువుతున్నాడు. అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకోవాల్సిన బాధ్యత సిసోదియాపై ఉంది’’ అని ఆయన తరఫు న్యాయవాది వాదించారు.

అయితే ఈ పిటిషన్‌ను సీబీఐ (CBI) వ్యతిరేకించింది. ‘‘ఆయన విదేశాలకు పారిపోకపోవచ్చు. కానీ, ఈ కేసులో ఆయన సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రమాదముంది. నిరంతరం ఫోన్లు మార్చిన ఓ వ్యక్తి అమాయకుడు మాత్రం కాదు. కచ్చితంగా సాక్ష్యాలను చెరిపివేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు 60 రోజుల గడువు ఉంది. ఇప్పుడు సిసోదియా (Manish Sisodia) బయటకు వస్తే దర్యాప్తు పక్కదారి పడుతుంది. సాక్షులను ఆయన ప్రభావితం చేసే అవకాశముంది’ అని సీబీఐ వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను మార్చి 24వ తేదీకి వాయిదా వేసింది.

ఈడీ కేసులోనూ బెయిల్‌కు దరఖాస్తు..

ఇక, ఇదే వ్యవహారంలో మనీలాండరింగ్‌ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఈడీ (ED).. జైల్లో ఉన్న సిసోదియాను ఇటీవల తన కస్టడీలో తీసుకుంది. ఈ నెల 22 వరకు ఆయన ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ఈ క్రమంలోనే మనీలాండరింగ్‌ కేసులోనూ బెయిల్‌ కోరుతూ ఆయన దిల్లీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. సిసోదియా బెయిల్‌ అభ్యర్థనపై మార్చి 25లోగా సమాధానం ఇవ్వాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. మరోవైపు, ఆయన జ్యుడీషియల్‌ కస్టడీని కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. దీంతో సిసోదియా ఏప్రిల్‌ 3 వరకు జైల్లోనే ఉండనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని