National News: అలిగిన సోదరుడికి అక్క లేఖ.. అదో గిన్నిస్‌ రికార్డు!

అది మే 24, 2022.. కేరళలోని ఇడుక్కికి చెందిన ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం విద్యార్థి కృష్ణ ప్రసాద్‌.. ఉదయం లేచినప్పటి నుంచి పదేపదే మొబైల్‌ ఫోన్‌ వైపే చూస్తున్నాడు. ఏదైనా కాల్‌ లేదా మెసేజ్‌ వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నాడు

Updated : 30 Jun 2022 10:49 IST

ఇడుక్కి (కేరళ): అది మే 24, 2022.. కేరళలోని ఇడుక్కికి చెందిన ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం విద్యార్థి కృష్ణ ప్రసాద్‌.. ఉదయం లేచినప్పటి నుంచి పదేపదే మొబైల్‌ ఫోన్‌ వైపే చూస్తున్నాడు. ఏదైనా కాల్‌ లేదా మెసేజ్‌ వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇక ఓపిక పట్టలేక.. తానే ఒకరికి కాల్‌ చేశాడు. అటువైపు నుంచి సరిగా స్పందన లేదు. రోజంతా ఎంతో బాధపడ్డాడు. సాయంత్రానికి ఆ బాధ కాస్తా కోపంగా మారింది. అవతలి వ్యక్తి కాల్‌ చేసినా బదులివ్వలేదు. వాట్సప్‌లో ఆ నంబరును బ్లాక్‌ చేశాడు. ఇంతకీ కృష్ణ ప్రసాద్‌(21)ను అంతలా బాధపెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? అక్క కృష్ణ ప్రియే(28). మే 24న సోదరుల దినోత్సవం అయినా.. ఆమె తనకు శుభాకాంక్షలు చెప్పలేదన్నదే అతడి ఆవేదన. ఇంజినీర్‌గా పనిచేస్తున్న కృష్ణ ప్రియకు విషయం ఆలస్యంగా అర్థమైంది. తప్పును సరిదిద్దుకుంటూ.. తమ్ముడంటే ఎంత ప్రేమో తెలియచేయాలని భావించింది. ఈ సందర్భంగా కృష్ణప్రియ మాట్లాడుతూ.. ‘‘బ్రదర్స్‌ డే శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోయా. దీంతో తమ్ముడు నాతో ఫోన్‌లో మాట్లాడడం మానేశాడు. వాట్సప్‌లో నా నంబరు బ్లాక్‌ చేశాడు. అందుకే లేఖ రాయాలని అనుకున్నా. ఎ4 సైజ్‌ కాగితాలపై రాయడం మొదలుపెట్టా. కానీ.. తమ్ముడికి నేను చెప్పాలనుకున్న విషయం రాసేందుకు అవి సరిపోవని అర్థమైంది. ఇంకా పొడవైన పేపర్లు కొనాలని అనుకున్నా. మార్కెట్‌కు వెళ్లి అడిగితే.. అలాంటివి ఉండవన్నారు. బిల్లింగ్‌ రోల్స్‌ మాత్రమే ఉంటాయని చెప్పారు. 14 బిల్లింగ్‌ రోల్స్‌ కొని ఇంటికి తెచ్చా. మొత్తం లేఖ రాసేందుకు 12 గంటలు పట్టింది. చివరకు ఆ లేఖ 434 మీటర్ల పొడవు, 5 కేజీల బరువు ఉంది’’ అని తెలిపింది. ఆమె శ్రమ వృథా పోలేదు. లేఖాస్త్రం ఫలించడంతో.. అక్కాతమ్ముళ్లు మళ్లీ ఒక్కటయ్యారు. మరోవైపు, ఈ భారీ లేఖకు.. ప్రపంచంలోనే అతి పొడవైన లేఖగా గిన్నిస్‌ రికార్డుల్లో చోటు దక్కే అవకాశముంది. ఇందుకోసం కృష్ణప్రియ ఇప్పటికే గిన్నిస్‌ సంస్థకు దరఖాస్తు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని