corona: భారత్‌లో విలయం.. ఆ దేశాలకు హెచ్చరిక

భారత్‌లో కరోనా సృష్టిస్తోన్న విలయం..అల్ప, మధ్యాదాయ దేశాలకు ఓ హెచ్చరికలాంటిదని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) ఆర్థికవేత్తలు హెచ్చరించారు. 

Published : 23 May 2021 01:35 IST

ఐఎంఎఫ్‌ నివేదిక

వాషింగ్టన్‌: భారత్‌లో కరోనా సృష్టిస్తోన్న విలయం.. అల్ప, మధ్యాదాయ దేశాలకు ఓ హెచ్చరికలాంటిదని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) ఆర్థికవేత్తలు హెచ్చరించారు. ఇంతవరకు మహమ్మారి ప్రకోపానికి గురికాని ఆయాదేశాలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే 2021 చివరినాటికి భారత్‌లో టీకా విస్తృతి 35 శాతం కంటే తక్కువగా ఉండొచ్చని ఓ నివేదికలో భాగంగా ఐఎంఎఫ్ ఆర్థిక వేత్తలు గీతా గోపీనాథ్, రుచిర్ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. 

బ్రెజిల్‌ చవిచూసిన కరోనా ఉపద్రవం, భారత్‌లో కనిపిస్తోన్న విలయం..మున్ముందు మిగిలిన అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో కూడా వచ్చే అవకాశం ఉందని ఆ నివేదిక హెచ్చరించింది. ‘ఇప్పటి వరకు కరోనా ఉప్పెనను చవిచూడని ఆఫ్రికాతో సహా, అల్ప, మధ్యాదాయ దేశాలకు భారత్‌లోని కరోనా పరిస్థితులు ఒక హెచ్చరిక’ అంటూ అప్రమత్తం చేసింది. మొదటి దశ ఉద్ధృతిని భారత వైద్యవ్యవస్థ తట్టుకోగలిగినప్పటికీ..రెండోదశలో వైద్యసదుపాయాల కొరత ప్రజల ప్రాణాల మీదకు తెస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. 

టీకా కొనుగోళ్లు, కొవాక్స్‌ కార్యక్రమం ద్వారా 2022 మధ్యనాటికి భారత్‌లో సుమారు 25 శాతం మంది జనాభాకు టీకా అందుతుందని ఆ ఆర్థికవేత్తలు అంచనా వేశారు. అలాగే 60 శాతం మందికి టీకాలు వేసేందుకు పెట్టుబడులను ప్రోత్సహించే, సరఫరా గొలుసును పెంచే ఒప్పందాల ద్వారా వెంటనే ఒక బిలియన్ డోసులకు ఆర్డర్ ఇవ్వాలని చెప్పారు. అలాగే సీరమ్ ఇనిస్టిట్యూట్, భారత్‌ బయోటెక్ సంస్థలు టీకా ఉత్పత్తిని పెంచేందుకు 600 మిలియన్ల డాలర్లను సమకూర్చనున్నట్లు అధికార వర్గాలు ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. అయితే ముడిపదార్థాలు, టీకాల సరఫరాకు అంతర్జాతీయంగా ఉన్న ఆటంకాలను తొలగించాలని, ఎటువంటి ఆలస్యం లేకుండా ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఈ నివేదికలో ఐఎంఫ్‌ సూచించింది. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు..సుమారు నాలుగువేల మరణాలు నమోదవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన టీకా కార్యక్రమంలో ఆశించిన వేగం కనిపించడం లేదు. టీకా కొరతను అధిగమించే విషయమై కొత్త టీకాలను వినియోగంలోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం 19 కోట్లకు పైగా టీకా డోసులను పంపిణీ చేసింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని