suspend: డ్యూటీ టైంలో ‘కోతి పిల్ల’ చేష్టలా?.. ఆరుగురు నర్సుల సస్పెన్షన్‌

డ్యూటీ సమయంలో కోతిపిల్లతో కొందరు నర్సులు ఆటలాడిన దృశ్యాలు వైరల్‌ కావడంతో ఉన్నతాధికారులు వారిని సస్పెండ్‌ చేశారు.

Published : 09 Jul 2024 18:08 IST

బహ్రైచ్: విధుల సమయంలో ఆస్పత్రిలో కొందరు నర్సులు (Nurses) కోతితో ఆడుతూ కనిపించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో ఆరుగురు నర్సుల్ని విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో ఓ ప్రభుత్వ మహిళా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహారాజా సుహెల్‌దేవ్‌ వైద్య కళాశాల ఆధ్వర్యంలోని ఆస్పత్రిలో కొందరు నర్సులు విధుల్లో  ఉంటూ కోతిపిల్లతో ఆడుతున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో సీరియస్‌ అయ్యారు.

హాథ్రస్‌ తొక్కిసలాటకు కారణమేంటీ? సిట్‌ నివేదిక ఏం చెప్పిందంటే..!

ఈ ఘటనపై ఆస్పత్రి చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా. ఎం.ఎం.త్రిపాఠి స్పందించారు. వీరిని ఆసుపత్రి గైనకాలజీ, ప్రసూతి విభాగంలో పనిచేస్తున్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. వైరలైన వీడియోలో ఉన్న ఆరుగురు నర్సుల్ని వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ సంజయ్‌ ఖత్రీ జులై 5న విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. ఈ అంశంపై విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు త్రిపాఠి తెలిపారు.

డ్యూటీ సమయంలో కోతితో రీల్స్‌ చేయడం, పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరించేలా సామాజిక మాధ్యమాల్లో వైరలైన ఈ వీడియోతో వైద్యకళాశాల ప్రతిష్ట దెబ్బతింటుందని ప్రిన్సిపాల్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశామని .. నివేదిక అందేవరకు ఈ ఆరుగురిని విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు వెల్లడించారు. నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని