జేఈఈ, నీట్‌ నిర్వహణపై సుప్రీంలో రివ్యూ పిటిషన్‌

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల జాతీయ అర్హత-ప్రవేశ పరీక్ష (నీట్‌), సాంకేతిక విద్యా కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ-మెయిన్‌)లను వాయిదా వేయడం కుదరదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై శుక్రవారం రివ్యూ పిటిషన్‌ దాఖలైంది...........

Published : 28 Aug 2020 14:38 IST

వాయిదా వేయాల్సిందేనన్న ఆరు రాష్ట్రాల మంత్రులు

దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల జాతీయ అర్హత-ప్రవేశ పరీక్ష (నీట్‌), సాంకేతిక విద్యా కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ-మెయిన్‌)లను వాయిదా వేయడం కుదరదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై శుక్రవారం రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. ఈ మేరకు ఆరు భాజపాయేతరపాలిత రాష్ట్రాలకు చెందిన మంత్రులు కోర్టును ఆశ్రయించారు. కొవిడ్‌ మహమ్మారి విజృంభణను పరిగణనలోకి తీసుకొని తీర్పు సమీక్షించాలని కోరారు. పశ్చిమ బెంగాల్‌, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌, మహారాష్ట్రకు చెందిన మంత్రులు పిటిషన్‌ వేసిన వారిలో ఉన్నారు.  

విలువైన విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు కోల్పోకూడదని వ్యాఖ్యానించిన సుప్రీకోర్టు నీట్‌, జేఈఈ పరీక్షల్ని వాయిదా వేయలేమంటూ ఆగస్టు 17న తీర్పు వెలువరించింది. దీంతో పరీక్షల నిర్వహణకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజేన్సీ(ఎన్‌టీఏ) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూలు ప్రకారం.. జేఈఈ (మెయిన్‌) సెప్టెంబర్‌ 1-6 తేదీల మధ్య; నీట్‌ సెప్టెంబర్‌ 13న జరుగనున్నాయి. ఇప్పటికే జేఈఈ అభ్యర్థులకు అడ్మిట్‌ కార్డులు కూడా జారీ అయ్యాయి. 

మరోవైపు ఈ ప్రవేశ పరీక్షల్ని వాయిదా వేయాలంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ సహా పలు ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేపడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ భాజపాయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. ఎట్టిపరిస్థితుల్లో విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చూడాలని నిర్ణయించారు. ఆ మేరకు నేడు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. కేంద్రం విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకునే వరకు పరీక్షల నిర్వహణకు వ్యతిరేకంగా గళం వినిపించాల్సిందేనని పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరూ విద్యార్థులకు అండగా ఉండాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని