Medicall college test positive: 60మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్‌: ఖరగ్‌పూర్‌ ఐఐటీలోనూ 60కేసులు

దేశంలో రోజురోజుకూ కోవిడ్‌ కేసుల పెరుగుదల నమోదవుతోంది. క్రమంగా విద్యా సంస్థల్లో విద్యార్థులు కూడా కోవిడ్‌ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు..

Updated : 04 Jan 2022 19:00 IST

పటియాల (పంజాబ్‌): దేశంలో రోజురోజుకూ కోవిడ్‌ కేసుల పెరుగుదల నమోదవుతోంది. క్రమంగా విద్యా సంస్థల్లో విద్యార్థులు కూడా కోవిడ్‌ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సెలవులు ప్రకటించగా, పలు రాష్ట్రాల్లో సంక్రాంతి నేపథ్యంలో ముందస్తుగా సెలవులు ప్రకటించారు. పండుగ  తర్వాత  పరిస్థితి ఆధారంగా విద్యాసంస్థలు తెరవడంపై ఆలోచిద్దాం అన్న ధోరణిలో  ప్రభుత్వాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈలోగా ప్రస్తుతం నడుస్తున్న విద్యా సంస్థల్లో కోవిడ్‌ కేసులు బయటపడుతున్నాయి. పంజాబ్‌లోని పటియాల మెడికల్‌ కాలేజీలో మంగళవారం 60 మంది విద్యార్థులకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారించారు. పటియాల జిల్లా యంత్రాంగం, ఆరోగ్యశాఖ అధికారులు సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంపై డిప్యూటీ కమిషనర్‌ సందీప్‌ హాన్స్‌ మాట్లాడుతూ..ప్రభుత్వం ఈనెల 15వరకు రాత్రి కర్ఫ్యూ విధించినట్లు, అప్పటి వరకు మెడికల్‌ కాలేజీకి సెలవులు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు సంబంధించి పూర్తి వైద్యనివేదిక రావాల్సి ఉందని,అప్పటి వరకు విద్యార్థులను సామాజిక దూరం పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని కోరినట్లు తెలిపారు. కేసుల నమోదుపై సివిల్‌ సర్జన్‌ ప్రిన్స్‌ సోథి మాట్లాడుతూ పంజాబ్‌లో కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రారంభమైందని ప్రజలు అనవసరంగా రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లవద్దని జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.రాష్ట్రంలోని విద్యాసంస్థలను ఈనెల 15వరకు మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఖరగ్‌పూర్‌ ఐఐటీలో కొందరికి స్వల్ప లక్షణాలు

ఖరగ్‌పూర్‌ ఐఐటీ క్యాంపస్‌లోనూ 40మంది విద్యార్థులు, రీసెర్చ్‌ స్కాలర్లు సహా 60మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. అధిక శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవని కొందరు స్పల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్‌ రిజిస్ట్రార్‌ తమల్‌నాథ్‌ వెల్లడించారు. కొందరు ఇళ్లలో ఐసోలేషన్‌లో ఉండగా, కొందరు ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.ఐఐటీ ఖరగ్‌పూర్‌కు సంబంధించి సిబ్బంది కుటుంబ సభ్యులకు జ్వరం వంటి ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రుల్లో పరీక్షించుకోవాలని కోరారు.డిసెంబర్‌ 18న ఖరగ్‌పూర్‌ ఐఐటీలో కాన్వగేషన్‌ నిర్వహించగా ఏడాదిన్నర విరామం తర్వాత దశల వారీగా విద్యార్థులను క్యాంపస్‌కు రప్పించడంపై దృష్టిసారించినట్లు తమల్‌నాథ్‌ పేర్కొన్నారు.అయితే తిరిగి పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతో తరగతులు ప్రారంభించడాన్ని వాయిదా వేస్తున్నట్లు, ఆన్‌లైన్‌ తరగతులు మాత్రమే కొనసాగుతాయన్నారు.డిసెంబర్‌ 27 తర్వాత 2000మంది విద్యార్థులు క్యాంపస్‌కు వచ్చినట్లు తెలిపారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని