Skill India: నైపుణ్య భారత్‌ ఉపయోగమెంత?

దేశంలోని యువతకు నైపుణ్యాలు పెంపొందించి వారికి ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన పథకం ద్వారా జనవరి 19, 2021 వరకు 1.07 కోట్ల మందికి శిక్షణ ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది....

Published : 14 Jun 2021 01:39 IST

దిల్లీ: దేశంలోని యువతకు నైపుణ్యాలు పెంపొందించి వారికి ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన పథకం ద్వారా జనవరి 19, 2021 వరకు 1.07 కోట్ల మందికి శిక్షణ ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. 40 కోట్ల మందికి శిక్షణ ఇవ్వడమే ధ్యేయంగా దాదాపు ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఈ పథకం తొలిదశలో ఎంత మేరకు యువతకు ఉపయోగపడిందనే విషయాన్ని పరిశీలిస్తే..

షార్ట్‌ టెర్మ్‌ శిక్షణ ద్వారా యువతలో వృత్తిపరమైన నైపుణ్యాలు పొందించేందుకు 2015 జులై 15న అంతర్జాతీయ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా  కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన (పీఎంకేవీవై)’ పథకాన్ని తీసుకొచ్చింది. 2022 నాటికి దేశ వ్యాప్తంగా 40 కోట్ల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. సౌలభ్యం కోసం దీనిని పీఎంకేవీవై 2.0, ( 2016-2020) పీఎంకేవీవై 3.0 (2020-2021) అని  విభజించింది.తాజాగా కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి 19 నాటికి 1.07 కోట్ల మంది యువత నైపుణ్య శిక్షణ తీసుకోగా.. అందులో 46.27 లక్షల మందికి షార్ట్‌ టెర్మ్‌, మరో 46.27 లక్షల మందికి ఓరియెంటేషన్ శిక్షణ ఇచ్చారు. మరోవైపు శిక్షణ పొందిన వారిలో 19 లక్షల మందికి ఉపాధి లభించినట్టు కేంద్రం చెబుతోంది.

లక్ష్యం ఎక్కువగా ఉండటం, మరోవైపు గడువు సమీపిస్తుండటంతో శిక్షణ పొందిన వారి సంఖ్యను పెంచేందుకు పీఎంకేవీవై 3.0 పేరుతో జనవరి 15, 2021న కొన్ని మార్పులు చేసింది. ఏడాది కాలంలో రూ.948కోట్ల వ్యయంతో 8 లక్షల మందికి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. వివిధ పథకాల తీరుతెన్నులను పరిశీలించిన మీదట కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భారతీయ శ్రామిక శక్తిని బలోపేతం చేసేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని అంటున్నాయి. వృత్తినైపుణ్యాలు పెంపొందించడం వల్ల దేశాభివృద్ధికి దోహదం చేయడమే కాకుండా భారతదేశం ప్రపంచ నైపుణ్యకేంద్రంగా మారేందుకు దోహదం చేస్తుందని కేంద్రం ఆశిస్తోంది. మరోవైపు ఈ పథకాన్ని అమలు చేయడంలో కేంద్రప్రభుత్వం వైఫల్యం చెందిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఐదేళ్లలో కేవలం 1.07 కోట్ల మందికే  శిక్షణ ఇస్తే రానున్న రెండు సంవత్సరాల్లో దాదాపు 39 కోట్ల మందికి ఎలా శిక్షణ ఇస్తారని ప్రశ్నిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని