భాజపాకు ఓటేయొద్దని రైతుల్ని కోరతాం!

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మూడు నెలలకు పైగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తున్న రైతులు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సంయుక్త కిసాన్‌ మోర్చా.........

Updated : 02 Mar 2021 21:47 IST

ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఎస్‌కేఎం నేతలు

దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మూడు నెలలకు పైగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తున్న రైతులు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) నేతలు మార్చి 15 వరకు ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో భాగంగా త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు రైతు బృందాలను పంపించి భాజపాను ఓడించాలని రైతులకు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. మార్చి 6న తమ పోరాటం 100వ రోజుకు చేరుకుంటున్న సందర్భంగా ఆ రోజు కుండ్లి- మానేసర్‌ - పల్వాల్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను దిగ్బంధించనున్నట్టు ఎస్‌కేఎం నేత యోగేంద్ర యాదవ్‌ వెల్లడించారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల దిగ్బంధం కొనసాగుతుందని తెలిపారు. రైతుల ఆందోళనలకు మద్దతుగా నిలవాలని,  ప్రజలు తమ ఇళ్ల వద్ద నల్ల జెండాలు ఎగురవేయాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు సంయుక్త కిసాన్‌ మోర్చా నేతలు సందర్శిస్తారని ఎస్‌కేఎం నేత బల్బిర్‌ సింగ్‌ రాజేవాల్‌ తెలిపారు. భాజపాకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఈ బృందాలు రైతులను కోరతాయన్నారు. రైతుల ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం తీరును ప్రజలకు వివరించాలని నిర్ణయించినట్టు చెప్పారు. మార్చి 12న కోల్‌కతాలో బహిరంగ సభ నిర్వహించి ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో రైతులకు విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిపారు. 

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 15న ఆందోళన

ఈనెల 5నుంచి కర్ణాటకలో ఎంఎస్‌పీ దిలావ్‌ పేరిట ఉద్యమం చేపట్టనున్నారు. ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో నిరసన శిబిరాల వద్ద తమ పోరాటంలో మహిళల్ని ముందుంచాలని నిర్ణయించారు. 10 పెద్ద ట్రేడ్‌ యూనియన్లతో సమావేశం నిర్వహించిన నేతలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 15న ఆందోళన చేపడతామని ప్రకటించారు. కార్మికులు, ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తారని తెలిపారు. రైతుల ఆందోళనల్ని ముందుకు తీసుకెళ్తామని నేతలు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని