Chidambaram: నోట్ల రద్దుపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం.. కానీ..!

పెద్ద నోట్ల రద్దుపై సుప్రీం కోర్టు తీర్పును  స్వాగతిస్తున్నప్పటికీ.. ధర్మాసనంలోని మైనార్టీ సభ్యులు వ్యతిరేకించడంపై పీ చిదంబరం సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదంటూ ట్వీట్‌ చేశారు.

Published : 02 Jan 2023 15:11 IST

దిల్లీ: పెద్ద నోట్ల రద్దుపై (Demonetisation) భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం స్వాగతించారు. ముఖ్యంగా నోట్ల రద్దు లక్ష్యం నెరవేరిందా అనే అంశంపై సుప్రీం (Supreme Court) ధర్మాసనం స్పష్టత ఇచ్చిందన్నారు. మెజారిటీ ధర్మాసనం దీనికి మద్దతు పలికినప్పటికీ.. మైనార్టీ తీర్పు మాత్రం ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదన్నారు. నోట్ల రద్దు చట్టవిరుద్ధమంటూ ధర్మాసనంలోని జస్టిస్‌ నాగరత్న చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ చిదంబరం ఈ విధంగా స్పందించారు.

‘నోట్ల రద్దుపై భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. అయినప్పటికీ, ఈ నిర్ణయాన్ని అందరూ సమర్థించారా, ప్రభుత్వం వాటి లక్ష్యాలను సాధించిందా అనే అంశాన్ని ప్రస్తావించడం అవసరం. లక్ష్యాలను సాధించే అంశంపై సుప్రీం కోర్టులోని మెజారిటీ ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. ఇదే సమయంలో నోట్ల రద్దు చట్టవిరుద్ధ మార్గంలో జరిగినట్లు ధర్మాసనంలోని ఒక న్యాయమూర్తి పేర్కొనడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిది’ అని కేంద్ర మాజీ ఆర్థికశాఖ మంత్రి పీ చిదంబరం అభిప్రాయపడ్డారు.

2016లో నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తూ నేడు కీలక తీర్పు వెలువరించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టంగా లేదని.. ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో 2016 నవంబర్‌ 8 నోటిఫికేషన్‌ చెల్లుబాటు అవుతుందని ధర్మాసనంలోని నలుగురు సభ్యులు స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వం కేవలం గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా కాకుండా ప్లీనరీ చట్టం రూపంలో నిర్ణయం వెలువరించాల్సిందని పేర్కొంటూ ధర్మాసనంలోని జస్టిస్‌ నాగరత్న తీర్పు వెలువరించారు. ఇలా పెద్ద నోట్ల రద్దుపై జస్టిస్‌ ఎన్‌.ఎ.నజీర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో నలుగురు సమర్థించగా.. ఒకరు వ్యతిరేకిస్తూ తీర్పు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని