Udaipur Murder: ఉదయ్‌పుర్‌ దర్జీ హత్య.. స్లీపర్‌ సెల్స్‌ పనేనా?

రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో పట్టపగలే దర్జీ దారుణ హత్య తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని

Updated : 29 Jun 2022 15:41 IST

కేసు దర్యాప్తు ఎన్‌ఐఏకు అప్పగింత

దిల్లీ: రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో పట్టపగలే దర్జీ దారుణ హత్య తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. కాగా.. ఈ హత్య పాక్‌ ఉగ్ర ముఠాకు చెందిన స్లీపర్‌ సెల్స్‌ చేసి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పాకిస్థాన్‌ ఆధారంగా పనిచేస్తోన్న ఓ తీవ్రవాద సంస్థకు చెందిన స్లీపర్‌ సెల్‌ ఈ దారుణ ఘటనకు పాల్పడిందని నిఘా వర్గాలు సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టే అవకాశముంది. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురు అనుమానితులను అరెస్టు చేయగా.. మరో 10 మందిని విచారిస్తున్నారు.

ఎన్‌ఐఏ చేతికి దర్యాప్తు..

ఇదిలా ఉండగా.. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను కేంద్ర హోంశాఖ.. జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది. ఈ మేరకు హోంశాఖ ట్విటర్‌లో వెల్లడించింది. ఈ హత్య కేసులో ముమ్మర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. దీని వెనుక ఏదైనా అంతర్జాతీయ ఉగ్ర ముఠా హస్తం ఉందా అనే కోణంలోనూ లోతుగా విచారణ చేపట్టాలని ఎన్‌ఐఏకు సూచించింది.

ఓ మతాన్ని అవమానించాడన్న ఆరోపణలతో ఉదయ్‌పుర్‌కు చెందిన కన్హయ్యలాల్‌ను పట్టపగలే ఇద్దరు వ్యక్తులు అతి కిరాతకంగా నరికి చంపారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడమేగాక.. ప్రధానిని కూడా చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. హత్యను ఖండిస్తూ కొన్ని చోట్ల జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో నగరానికి అదనపు పోలీసులను రప్పించి భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఈ ఘటనను పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. అతివాదం, హింస ఏ రూపంలో ఉన్నా దాన్ని ఎప్పటికీ అంగీకరించకూడదని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు. ఉదయ్‌పుర్‌ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని