పొగ తాగేవారికి మరణముప్పు 50% అధికం!

పొగ తాగేవారిలో కరోనా వల్ల మరణించే ముప్పు 50 శాతం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ తెలిపారు. అలాగే క్యాన్సర్‌...

Updated : 30 May 2021 15:55 IST

స్పష్టం చేసిన డబ్ల్యూహెచ్‌ఓ

న్యూయార్క్‌: పొగ తాగేవారిలో కరోనా వల్ల మరణించే ముప్పు 50 శాతం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ తెలిపారు. అలాగే క్యాన్సర్‌, గుండె సంబంధిత సమస్యలు, కరోనా వల్ల తలెత్తే శ్వాస సంబంధిత సమస్యలు కూడా సోకే ముప్పు అధికంగా ఉంటుందని వెల్లడించారు. పొగాకు నివారణలో భాగంగా డబ్ల్యూహెచ్‌ఓ నిర్వహిస్తున్న ‘కమిట్‌ టు క్విట్‌’ అవగాహన సదస్సులో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పొగ తాగేవారికి కరోనా ముప్పు అధికమని భారత ఆరోగ్య శాఖ ఏడాది క్రతమే హెచ్చరించడం గమనార్హం.

కరోనా వల్ల తలెత్తే ముప్పునకు దూరంగా ఉండాలంటే పొగ తాగే వారు పొగాకుకు దూరంగా ఉండడమే మేలైన మార్గమని టెడ్రోస్‌ స్పష్టం చేశారు. పొగాకు రహిత వాతావరణాన్ని సృష్టించడం కోసం డబ్ల్యూహెచ్‌ఓ చేస్తున్న కార్యక్రమంలో ప్రతి దేశం పాల్గొనాలని పిలుపునిచ్చారు. తద్వారా ప్రజలు పొగాకు వదిలిపెట్టేందుకు కావాల్సిన సమాచారం, మద్దతు, టూల్స్‌ లభిస్తాయని పేర్కొన్నారు. క్విట్‌ ఛాలెంజ్‌ పేరిట, వాట్సప్‌, ఫేస్‌బుక్‌, వైబర్‌, వీ చాట్‌లో కావాల్సిన సమాచారం అందుతుందన్నారు.

ఇక పొగాకు రహిత సమాజం కోసం డబ్ల్యూహెచ్‌ఓ చేస్తున్న కృషికి భారత్‌ నుంచి లభిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా టెడ్రోస్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ-సిగరెట్లు, ‘హీటెడ్‌ టొబాకో ప్రొడక్ట్స్‌(హెచ్‌టీపీ)’ను నిషేధిస్తూ భారత్‌లో చట్టం తీసుకొచ్చినందుకుగానూ ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని