Air India: విమానంలో వ్యక్తి స్మోకింగ్‌.. కాళ్లు, చేతులు కట్టేసి కూర్చోబెట్టి..!

ఎయిరిండియా (Air India) విమానంలో పొగతాగుతూ (Smoking) అల్లరి చేసిన ప్రయాణికుడిపై ముంబయి (Mumbai) పోలీసులు కేసు నమోదు చేశారు. పొగతాగడంతోపాటు తోటి ప్రయాణికులు, సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు రావడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Published : 12 Mar 2023 16:09 IST

ముంబయి:  విమానాల్లో ఇటీవల కొంతమంది ప్రయాణికుల ప్రవర్తన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించడం, నిబంధనలను అతిక్రమించే ఘటనలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అటు పౌరవిమానయాన సంస్థలు కూడా హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో లండన్‌ నుంచి ముంబయి వస్తోన్న ఎయిరిండియా (Air India) విమానంలో ప్రయాణికుడు సిగరెట్‌ తాగడం (Smoking) కలకలం రేపింది. ఇది గమనించి ప్రశ్నించిన సిబ్బందిపైనా అతడు వాగ్వాదానికి దిగడం గమనార్హం. ఇలా ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన అతడిని కాళ్లు, చేతులు బంధించి సీటులో కూర్చోబెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై విమానయాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదయ్యింది.

భారత సంతతికి చెందిన రమాకాంత్‌ (37) అనే వ్యక్తి ఇటీవల లండన్‌ నుంచి ముంబయికి ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఆ క్రమంలో అతడు విమానంలో బాత్రూంకి వెళ్లి స్మోకింగ్‌ (Smoking) చేయడం మొదలుపెట్టాడు. వెంటనే అలారమ్‌ మోగడంతో అప్రమత్తమైన సిబ్బంది.. బాత్రూం దగ్గరకు పరుగెత్తారు. వెంటనే అతడి చేతిలో ఉన్న సిగరెట్‌ను తీసివేశారు. దీంతో అరవడం మొదలుపెట్టిన అతన్ని సీటు వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా విమాన డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు. అతడి ప్రవర్తనతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు వారించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు అతడి కాళ్లు, చేతులు బంధించి కుర్చీలోనే కుర్చునేలా చేశామని విమాన సిబ్బంది వెల్లడించారు. అయినప్పటికీ తలను గట్టిగా తిప్పుతూ ఆగ్రహంతో ఊగిపోయాడని చెప్పారు.

విమానం ముంబయి చేరుకున్న వెంటనే సదరు ప్రయాణికుడిని ఎయిర్‌పోర్టు సెక్యూరిటీకి అప్పజెప్పడంతోపాటు విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎయిరిండియా వెల్లడించింది. దీంతో అతడిపై ఐపీసీతోపాటు ఎయిర్‌క్రాఫ్ట్‌ చట్టం 1937లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ముంబయి పోలీసులు పేర్కొన్నారు. అతడు భారత సంతతి వ్యక్తి అని, అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నట్లు గుర్తించామన్నారు. అయితే, అతడు మద్యం మత్తులో ఉన్నాడా..? లేక ఏమైనా మానసిక సమస్యలు ఉన్నాయా? అని తెలుసుకునేందుకు వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి పంపించామని పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని