స్మృతీ ఇరానీకి ధరల సెగ.. వ్యాక్సిన్లు, రేషన్‌ అంటూ సమాధానం

కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి ఎల్పీజీ, చమురు ధరల సెగ తగిలింది. ధరల పెంపుపై స్మృతి ఇరానీకి, కాంగ్రెస్ మహిళా విభాగం నేత నెట్టా డిసౌజా మధ్య విమానం వేదికగా వాడీ వేడీ చర్చ జరిగింది.

Published : 11 Apr 2022 02:04 IST

దిల్లీ: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి ఎల్పీజీ, చమురు ధరల సెగ తగిలింది. ధరల పెంపుపై స్మృతి ఇరానీకి, కాంగ్రెస్ మహిళా విభాగం నేత నెట్టా డిసౌజా మధ్య విమానం వేదికగా వాడీ వేడీ చర్చ జరిగింది. దిల్లీ-గువాహటి విమానం నుంచి దిగుతున్న సమయంలో ఈ సంభాషణ చోటుచేసుకుంది. ఇండిగో విమానంలో ఆదివారం ఈ ఘటన జరిగినట్లు ఆ విమానయాన సంస్థ ధ్రువీకరించింది.

విమానం దిగే సమయంలో తొలుత ఇరానీని డిసౌజా ఇంధన ధరల గురించి ప్రశ్నించారు. ధరల పెంపు కారణంగా స్టవ్‌లు గ్యాస్ లేకుండా తయారౌతున్నాయని డిసౌజా విమర్శించగా.. అబద్ధాలు చెప్పొద్దంటూ స్మృతీ ఇరానీ బదులిచ్చారు. ధరల పెంపుపై ఇరువురు నేతల మధ్య కాసేపు చర్చ జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను డిసౌజా తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. పెరుగుతున్న ఎల్పీజీ ధరల గురించి ప్రశ్నిస్తే కేంద్రమంత్రి వ్యాక్సిన్లు, రేషన్‌ గురించి మాట్లాడుతున్నారంటూ అందులో పేర్కొన్నారు. పేద ప్రజల కష్టాలపై కేంద్రమంత్రి స్పందన చూడండి అంటూ ట్వీట్ చేశారు. వీడియో తీస్తున్న సమయంలో స్మృతీ ఇరానీ సైతం వీడియో తీయడం కనిపించింది. కొన్ని పదాలు వినిపించనప్పటికీ.. ఎల్పీజీ, చమురు ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ నేత ప్రశ్నించగా.. గత కొన్ని నెలలుగా 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార పదార్థాలను కేంద్రమే అందిస్తోందని స్మృతీ ఇరానీ చెప్పడం వినిపించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని