Smriti Irani: అప్పుడు అవినీతి అంటే ద్రోహం అని.. ఇప్పుడు మీ మంత్రికి క్లీన్‌చిట్ ఏంటి..?

దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అరెస్టు విషయంలో భాజపా, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) విమర్శలు గుప్పించుకుంటున్నాయి.

Published : 01 Jun 2022 18:56 IST

కేజ్రీవాల్‌పై ప్రశ్నలు సంధించిన స్మృతి ఇరానీ 

దిల్లీ: దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అరెస్టు విషయంలో భాజపా, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) విమర్శలు గుప్పించుకుంటున్నాయి. దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. తన మంత్రికి క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ దుయ్యబట్టారు. ఇది రాజకీయ దురుద్దేశంతో పెట్టిన నకిలీ కేసుగా కేజ్రీవాల్ అభివర్ణించడాన్ని తప్పుపట్టారు. ముఖ్యమంత్రి తనను తాను న్యాయమూర్తిగా భావిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మీడియా వేదికగా పలు ప్రశ్నలను సంధించారు. అవినీతి అంటే దేశానికి ద్రోహం చేయడమేనంటూ గతంలో కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘కేజ్రీవాల్‌జీ.. మీరు ఒక దేశద్రోహికి సహకరిస్తున్నారా..? ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగాలా..?’ అంటూ ప్రశ్నించారు. 

సత్యేందర్‌కు పద్మ విభూషణ్ ఇవ్వాలి: కేజ్రీవాల్‌

మరోపక్క కేజ్రీవాల్ తన మంత్రి సత్యేందర్‌ జైన్‌కు మద్దతుగా నిలిచారు. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమ మంత్రి చేసిన కృషికి పద్మ విభూషణ్ ఇవ్వాలని దిల్లీ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆయనో దేశభక్తుడని, దేశం ఆయన పట్ల గర్వపడాలన్నారు. దిల్లీకి ఆయన మొహల్లా క్లినిక్‌లు ఇచ్చారని తెలిపారు. వాటి గురించి తెలుసుకొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఆసక్తిగా ముందుకు వస్తున్నాయన్నారు. ‘ఆయనకు పద్మవిభూషణ్ ఇవ్వాలి. దర్యాప్తు సంస్థలను ఆయనపై విచారణ జరుపుకోనివ్వండి. సీబీఐ ఇప్పటికే ఆయనపై కేసుల్ని క్లియర్ చేసింది. ఈడీ కూడా అదే చేస్తుంది’ అని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. 

మనీలాండరింగ్ కేసులో సోమవారం సత్యేందర్ జైన్‌ను ఈడీ అరెస్టు చేసింది. 2015-16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా ఆయన కంపెనీలకు.. షెల్‌ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ తన దర్యాప్తులో ఆరోపించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ.. ఈ హవాలా కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే దాదాపు రెండు నెలల క్రితం సత్యేందర్‌, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. తాజాగా ఆయన్ను అదుపులోకి తీసుకొంది. ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం జూన్‌ 9 వరకు ఆయన కస్టడీలో ఉండాల్సి ఉంది. కాగా, త్వరలో తమ మంత్రి జైన్‌ను ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని