Girl child: స్మృతి పవర్‌ఫుల్ సందేశం

‘చిన్ని చిన్ని ఆశ.. చిన్నదాని ఆశ’ అంటూ ఓ చిన్నారి మది కోరుకుంటున్న విషయాన్ని బయటపెట్టారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు ద్వారా ఓ పవర్‌ఫుల్ సందేశాన్ని వినిపించారు. 

Published : 07 Jul 2021 20:16 IST

దిల్లీ: ‘చిన్ని చిన్ని ఆశ.. చిన్నదాని ఆశ’ అంటూ ఓ చిన్నారి మది కోరుకుంటున్న విషయాన్ని బయటపెట్టారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు ద్వారా ఓ పవర్‌ఫుల్ సందేశాన్ని వినిపించారు. 

స్మృతి షేర్‌ చేసిన యానిమేటెడ్ వీడియోలో.. కన్నీరు కారుస్తూ, చింపిరి జుత్తుతో ఉన్న బాలిక కనిపిస్తుంది. చేతిలో చీపురుతో చిన్న వయసులో పనికి వెళ్లాల్సిన పరిస్థితిలో ఉంది. ఆ తరవాత ఆ చిరిగిన దుస్తుల స్థానంలో పాఠశాల యూనిఫాం, చేతిలోకి పుస్తకాలు వచ్చి చేరతాయి. దాంతో పసిదాని మనసు వెలిగిపోవడం మనం చూస్తాం. ఆడపిల్లల విద్య ప్రాముఖ్యతను వెల్లడిచేస్తూ..స్మృతి ఆ వీడియోను నెట్టింట్లో పంచుకున్నారు. ‘మీ కుమార్తెలు స్వేచ్ఛగా ఎగిరేందుకు రెక్కలివ్వండి’ అంటూ ఓ వ్యాఖ్యను జోడించారు. అలాగే #BetiBachaoBetiPadhao అనే ట్యాగ్‌ను జోడించారు. ఈ వీడియో నడుస్తున్నంతసేపు వెనుక రోజా సినిమాలో చిన్నిచిన్ని ఆశ పాట వినిపిస్తూ ఉంటుంది. ఈ పోస్టు నెటిజన్లను మెప్పించింది. ‘గొప్ప సందేశం, చాలా ముఖ్యమైంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

కరోనామహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు మూసిఉన్న సంగతి తెలిసిందే. ఇది బాలికల విద్యపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అంతర్జాతీయంగా నివేదికలు కూడా వెలువడ్డాయి.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని