Smriti Irani: జర్నలిస్టును ‘బెదిరించిన’ స్మృతి ఇరానీ.. వీడియో షేర్‌ చేసిన కాంగ్రెస్‌

ప్రశ్నలు అడిగిన జర్నలిస్టును కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) బెదిరిస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఓ వైరల్‌ వీడియోను షేర్‌ చేస్తూ విమర్శించింది. అయితే దీనికి ఆమె కూడా గట్టిగానే బదులిచ్చింది.

Published : 10 Jun 2023 17:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) ఓ విలేకరి (Journalist)పై ఆమె మండిపడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అయ్యింది. దీన్ని తమ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసిన కాంగ్రెస్‌ (Congress).. కేంద్రమంత్రిపై విమర్శలు గుప్పించింది. మీడియాపై స్మృతి ఇరానీ బెదిరింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టింది. అసలేం జరిగిందంటే..

స్మృతి ఇరానీ ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని తన సొంత నియోజకవర్గమైన అమేఠీ (Amethi)లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెను విలేకరులు చుట్టుముట్టి ప్రశ్నలు అడిగారు. అయితే, ఆ సమయంలో ఓ విలేకరిపై ఆమె మండిపడ్డారు. తన నియోజకవర్గ ప్రజలను అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో (Viral Video) ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. తన నియోజకవర్గ ప్రజలను అవమానిస్తేతాను ఊరుకోనని ఆమె అన్నారు. దీనికి ఆ విలేకరి బదులిస్తూ.. ‘‘నేను ఎవర్నీ కించపర్చట్లేదు. మీ చర్యల గురించి ప్రశ్నిస్తున్నాను అంతే. మీకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా లేరు’’ అని అన్నాడు. దీనికి ఆగ్రహించిన స్మృతి (Smriti Irani).. ‘‘మరోసారి నా నియోజకవర్గ ప్రజలను అవమానిస్తే చూస్తూ ఉండను. మీకు ప్రజలను కించపర్చే హక్కు లేదు. మీరు పెద్ద రిపోర్టర్‌ కావొచ్చు. కానీ ఇంకోసారి ఇలా చేస్తే మీ పై అధికారికి కాల్‌ చేయాల్సి ఉంటుంది. వాళ్లే అన్నీ చూసుకుంటారు జాగ్రత్త..!’’ అని హెచ్చరించారు.

సమాధానం చెప్పలేక బెదిరింపులు..: కాంగ్రెస్‌

ఈ వీడియోను కాంగ్రెస్‌ (Congress) పోస్ట్ చేస్తూ.. ‘‘స్మృతి ఇరానీజీ విలేకరులను బెదిరిస్తున్నారు. వారి ఉద్యోగాలను ఊడగొట్టాలని చూస్తున్నారు. ఇక నుంచి జర్నలిస్టులు కేవలం చక్కెర రూ.13కు ఎప్పుడు వస్తుంది? గ్యాస్‌ సిలిండర్‌ ధర ఎప్పుడు తగ్గుతుంది? అమ్మాయిలపై జరుగుతున్న అకృత్యాలపై మౌనం ఎందుకు? ఇలాంటి ప్రశ్నలే అడగాలేమో..! సమాధానం చెప్పలేని ప్రశ్నలడిగితే.. ఆమె కారు దిగి బెదిరిస్తారు. స్మృతిజీ మీరో విషయం అర్థం చేసుకోవాలి. ఇది ప్రేమ కాదు’’ అని కేంద్రమంత్రిపై విమర్శలు గుప్పించింది.

స్మృతి కౌంటర్‌..

అయితే కాంగ్రెస్‌ విమర్శలకు స్మృతి ఇరానీ (Smriti Irani) కూడా గట్టిగానే బదులిచ్చారు. ‘‘అమేఠీ ప్రజలతో తప్పుగా ప్రవర్తించొద్దనే నేను చెప్పాను. అది అభ్యర్థన అని మీకు (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) అర్థం కాకపోవచ్చు. అమేఠీ ప్రజలను అవమానిస్తే మీరు భరించగలరేమో గానీ.. నేను కాదు. ఇక ప్రశ్నల గురించి అంటారా? చెప్పండి దీని గురించి మాజీ ఎంపీ (రాహుల్‌ గాంధీని ఉద్దేశిస్తూ)తో ఎప్పుడు డిబేట్‌కు దిగాలి. అప్పుడే చక్కెర, పిండి, పప్పుల ధరలు కూడా చెబుతాను’’ అని కేంద్రమంత్రి హస్తానికి కౌంటర్‌ ఇచ్చారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని