Chardham: ప్రతికూల వాతావరణం.. చార్‌ధామ్‌ యాత్రికులకు అలెర్ట్‌!

చార్‌ధామ్‌ యాత్రలోని బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ ప్రాంతాల్లో భారీ వర్షం, మంచు కురుస్తోంది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యాత్రికులకు అధికార యంత్రాంగం అలెర్ట్‌ చేసింది.

Published : 01 May 2023 22:53 IST

దేహ్రాదూన్‌: పవిత్ర చార్‌ధామ్‌ యాత్ర (Chardham Yatra)లో భక్తులకు ఏటా ప్రకృతి సవాల్‌ విసురుతూనే ఉంటుంది. ఈ ఏడాది సైతం.. యాత్ర మొదలైన కొన్ని రోజులకే ప్రతికూల వాతావరణం యాత్రకు అడ్డంకిగా మారింది. ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని బద్రీనాథ్ (Badrinath), కేదార్‌నాథ్ (Kedarnath) ఆలయ ప్రాంతాల్లో హిమపాతం (Snowfall), భారీ వర్షం కురుస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 

ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా.. కేదార్‌నాథ్‌ సందర్శనకు వచ్చే యాత్రికులు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలని రుద్రప్రయాగ్ జిల్లా యంత్రాంగం సూచించింది. నిరంతరం మంచు కురుస్తుండటంతో.. సోన్‌ప్రయాగ్ నుంచి కేదార్‌నాథ్‌కు వెళ్లేందుకు అనుమతించడం లేదు. వాతావరణం అనుకూలించినప్పుడు, అవసరమైన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే యాత్రికులు తమ ప్రయాణాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేసింది.

రాష్ట్రానికి ఎల్లో అలర్ట్‌ జారీ..

ఉత్తరాఖండ్‌కు వాతావరణ విభాగం ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో రెండు, మూడు రోజులపాటు వర్షం, వడగళ్లు, మంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో కేదార్‌నాథ్‌కు వచ్చేవారు యాత్రికులు.. ముందస్తుగా వాతావరణ సమాచారం తెలుసుకుని, బస కోసం ఏర్పాట్లు చేసుకున్న తర్వాతే తమ ప్రయాణాన్ని కొనసాగించాలని బద్రీనాథ్- కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ సూచించారు.

మరోవైపు.. బద్రీనాథ్‌లోనూ మంచు, వర్షం కురుస్తోంది. ఆదివారం కొండ చరియలు విరిగిపడి మూసుకుపోయిన బద్రీనాథ్‌ జాతీయ రహదారిని.. సోమవారం పునరుద్ధరించారు. ఈ మార్గంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న సిరోబగఢ్‌లో.. ఎల్లవేళలా సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇదిలా ఉండగా.. ఏప్రిల్‌ 22న చార్‌ధామ్‌ యాత్ర మొదలైన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని