Joshimath: జోషీమఠ్‌లో ‘మంచు’ కష్టాలు.. నిలిచిన కూల్చివేతలు!

ఉత్తరాఖండ్‌లో దట్టమైన మంచు కురుస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఇక్కడి జోషీమఠ్‌లో ప్రమాదకరంగా మారిన భవనాల కూల్చివేతలు నిలిచిపోయాయి. 

Published : 21 Jan 2023 00:30 IST

దెహ్రాదూన్: ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌(Joshimath)లో భూమి కుంగిపోతుండటంతో వందలాది ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతోన్న విషయం తెలిసిందే. దీంతో 200కుపైగా బాధిత కుటుంబాలను అధికారులు తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలకు తరలించారు. ఇప్పటికే వారు ఇళ్లను కోల్పోగా.. తాజాగా రాష్ట్రంలోని అతి శీతల వాతావరణ పరిస్థితులు వారి కష్టాలను మరింత పెంచాయి! సహాయక చర్యలు చేపట్టడం అధికారులకు సవాల్‌గా మారింది.

రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం మంచు కురవడం, తుంపర్ల వర్షం కారణంగా చలి తీవ్రత పెరిగింది. జోషిమఠ్‌తో పాటు బద్రీనాథ్‌, ఔలీ, కేదార్‌నాథ్‌, హేమ్‌కుండ్‌ సాహిబ్‌, నందా దేవీ జాతీయ పార్కు తదితర ప్రాంతాల్లో మంచు కురుస్తోందని అధికారులు తెలిపారు. రుద్రప్రయాగ్‌, ఛమోలీ తదితర జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు వెల్లడించారు. ఛమోలీ జిల్లాలో 47 గ్రామాల్లో హిమపాతం సంభవించింది. ఇందులో 17 గ్రామాలు జోషీమఠ్‌ పరిధిలోనే ఉన్నాయి.

ప్రతికూల వాతావరణం కారణంగా.. జోషీమఠ్‌లో ప్రమాదకరంగా మారిన హోటళ్లు, ఇళ్లను కూల్చివేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు చమోలీ జిల్లా మేజిస్ట్రేట్ హిమాన్షు ఖురానా తెలిపారు. భూమి కుంగుబాటుతో ఇప్పటివరకు జోషిమఠ్‌లో 850కిపైగా ఇళ్లకు పగుళ్లు ఏర్పడినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. 269 కుటుంబాలకు చెందిన 900 మంది నిరాశ్రయులయ్యారని వెల్లడించింది. 218 కుటుంబాలకు ముందస్తు సాయం కింద రూ.3.27 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు