Mukesh Ambanis driver: అంబానీ డ్రైవర్ జీతం.. తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ(Mukesh Ambani) డ్రైవర్ జీతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 

Published : 05 Mar 2023 01:36 IST

ముంబయి: సెలబ్రిటీ.. ఈ పదానికున్న ఆకర్షణే వేరు. సెలబ్రిటీల లైఫ్‌స్టైల్‌తో పాటు వారి దగ్గర పనిచేసేవారు అప్పుడప్పుడు వైరల్‌ అవుతుంటారు. తాజాగా అపరకుబేరుడు ముకేశ్‌ అంబానీ(Mukesh Ambani) వ్యక్తిగత డ్రైవర్ వార్తల్లో నిలిచారు. అతడి జీతం గురించిన వివరాలతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న వీడియోపై వార్తా కథానాలు వెలువడ్డాయి. 

2017లో ముకేశ్‌ అంబానీ డ్రైవర్ జీతం నెలకు రెండు లక్షల రూపాయలని దానిని బట్టి తెలుస్తోంది. అంటే ఏడాదికి రూ.24 లక్షలు. బహుళజాతి సంస్థల్లో పనిచేసే వృత్తి నిపుణులకు కూడా ఈరోజుల్లో ఈ స్థాయి జీతం లభించడం లేదు. ఐదేళ్ల క్రితమే రూ.2 లక్షలుంటే.. 2023లో ఇంకా ఎంత పెరిగి ఉంటుందో. అది ఎంతనేదానిపై స్పష్టమైన వివరాలు అందుబాటులో లేవు.

ప్రపంచకుబేరుడు ఇంట్లో పనిచేస్తున్నారంటే.. వారికి పనిలో ఎంతో నైపుణ్యం ఉండాల్సిందే. అంబానీ(Mukesh Ambani) డ్రైవర్లను ఓ ప్రైవేటు కాంట్రాక్టు సంస్థ ద్వారా నియమించుకున్నారని ఆ వార్తా కథనాలు పేర్కొన్నాయి. లగ్జరీ, బుల్లెట్ ప్రూఫ్ కార్లను ఎలావాడాలి..? అని ఆ కాంట్రాక్టు సంస్థలు శిక్షణ ఇస్తుంటాయి. ఏ తరహా రోడ్లపైన అయినా, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితుల మధ్య అయినా వాహనాన్ని నడిపేలా వీరికి ట్రైనింగ్‌ ఇస్తారు. డ్రైవర్లతో పాటు వంటమనుషులు, గార్డ్స్‌, ఇతర సిబ్బందికి ప్రోత్సాహకాలతో పాటు ఇన్సూరెన్స్ కూడా ఉంటుందని ఆ కథనాలు వెల్లడించాయి.

ఇదే తరహాలో ఇదివరకు సినిమా సెలబ్రిటీల మేనేజర్లు, బాడీ గార్డులు, నానీ(ఆయా)ల జీతాలు బయటకు వచ్చాయి. అక్షయ్‌ కుమార్, అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ ఖాన్‌ వంటి స్టార్‌ హీరోలు తమ బాడీగార్డులకు ఏడాదికి కోట్లల్లో జీతం ఇస్తున్నారు. కరీనా కపూర్‌(kareena kapoor) తన పిల్లల్ని చూసుకునే నానీకి నెలకు లక్షన్నర రూపాయలు ఇస్తుండగా.. ఎప్పుడైనా ఓవర్‌ టైమ్ చేస్తే ఆ మొత్తాన్ని రూ.1.75 లక్షలకు పెంచుతారట. ఇక ఇటీవల షారుక్‌ ఖాన్‌(Shahrukh khan) మేనేజర్ ఒక విలాసవంతమైన ఇంటిని సొంతం చేసుకున్నారు. ఆమె సంవత్సరానికి రూ. 7 కోట్ల నుంచి 9 కోట్ల జీతం అందుకుంటారని తెలుస్తోంది. ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.50 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని