సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి 55 కోట్ల మంది: నిర్మల సీతారామన్‌

Nirmala Sitharaman: ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాలైన PMJJBY, PMSBY, APY ప్రవేశపెట్టి నేటితో 8 ఏళ్లు పూర్తయ్యాయి. మొత్తం 55 కోట్ల మంది ఈ పథకంలో చేరారని వెల్లడించారు.

Published : 09 May 2023 18:44 IST

 

దిల్లీ: ఊహించని పరిణామాలు, ఆర్థికంగా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు పేదలకు అండగా నిలిచే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పథకాలను అందిస్తోందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), అటల్‌ పెన్షన్‌ యోజన (APY) యోజన పథకాల ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వారికి భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. ఈ మూడు పథకాలు ప్రారంభమై నేటితో 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఇప్పటి వరకు 55 కోట్ల మంది ఈ పథకాల్లో చేరారని చెప్పారు. 

‘‘ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా సామాజిక భద్రతా పథకాలను ప్రవేశపెట్టాం. ఇప్పటివరకు పీఎంజేజేబీవై పథకానికి 16.2 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 6.64 లక్షల కుటుంబాలు రూ.13,290 కోట్ల ఆర్థిక సాయాన్ని పొందాయి. పీఎంఎస్‌బీవై కింద పెద్ద ఎత్తున 34.2 కోట్ల మంది నమోదు చేసుకోగా.. 1.15 లక్షల కుటుంబాలు రూ.2,302 కోట్ల ఆర్థిక లబ్ధి పొందాయి. అటల్‌ పెన్షన్‌ యోజన (APY) పథకం కింద ఇప్పటి వరకు 5.2 కోట్ల మంది నమోదు చేసుకున్నారు’ అని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ పథకాలను అర్హులైన అందరికీ అందించే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామపంచాయతీల్లోనూ ప్రచారం చేశామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కె కరాడ్‌ తెలిపారు. 

PMJJBY కింద 18-50 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులకు బీమా సౌకర్యం ఉంటుంది. ఏటా రూ.436 చెల్లించడం ద్వారా బీమా సౌకర్యం పొందొచ్చు. ఏదైనా కారణంతో బీమా తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు అందుతుంది. PMSBY కింద రోడ్డు ప్రమాదంలో బీమా తీసుకున్న వ్యక్తి మరణిస్తే రూ.2 లక్షలు, శాశ్వత అంగవైకల్యం పొందితే రూ.1లక్ష చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తుంది. ఈ పథకం కింద ఏటా రూ.20 చెల్లించాలి. 18-70 ఏళ్లు ఉన్నవారు అర్హులు. వృద్ధాప్యంలో ఆర్థికంగా సాయం అందించడానికి తీసుకొచ్చిన మరో పథకం ఏపీవై. 60 ఏళ్లు పైబడిన వారికి నెలకు వెయ్యి రూపాయల నుంచి రూ.5 వేల వరకు పెన్షన్ అందుతుంది. 18-40 ఏళ్ల వయసున్న వారు ఈ పథకానికి నమోదు చేసుకోవచ్చు. ఈ మూడు సామాజిక భద్రతా పథకాలను 2015 మే 9న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని