Soldier: ‘ఫేమస్‌’ కావాలని.. కేరళలో ఓ సైనికుడి నిర్వాకం!

ఓ సైనికుడిపై కొందరు దాడి చేసి, వీపుపై నిషేధిత ‘పీఎఫ్‌ఐ’ అని రాశారని పేర్కొన్న ఘటన ఉత్తిదేనని తేలింది.

Published : 26 Sep 2023 16:50 IST

తిరువనంతపురం: తనపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని కేరళకు చెందిన ఓ సైనికుడు (Assault on Soldier) పేర్కొన్న విషయం తెలిసిందే. తనపై కొందరు దాడి చేసి, శరీరంపై నిషేధిత ‘పీఎఫ్‌ఐ’ (PFI) అని రాశారంటూ ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. అయితే, అతడు చేసిన ఆరోపణలు తప్పని తేలింది. ఉద్దేశపూర్వకంగానే తప్పుడు స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలో ఆ సైనికుడితోపాటు అతడికి సహకరించిన వ్యక్తిని పోలీసులు (Kerala Police) అదుపులోకి తీసుకున్నారు. కేవలం ‘ఫేమస్‌’ కావాలనే ఉద్దేశంతోనే ఆ సైనికుడు ఈ నాటకానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

కేరళలోని కడక్కల్‌కు చెందిన షైన్‌ కుమార్‌ అనే ఆర్మీ జవాన్‌.. రాజస్థాన్‌లోని సైనిక ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్నాడు. సెలవులపై స్వస్థలానికి వచ్చాడు. ఆదివారం రాత్రి తన ఇంటి సమీపంలో ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని ఆరోపించాడు. ఈ క్రమంలోనే తన చేతులను టేప్‌తో కట్టేసి, వీపుపై ‘పీఎఫ్ఐ’ అని రాశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటన కాస్త సంచలనం రేకెత్తించింది. దీంతో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. జవాన్‌తోపాటు అతడి స్నేహితుడిని విచారించగా అసలు విషయం బయట పడింది.

ఖాకీ దుస్తుల్లో ఎవరొచ్చినా కరిచేలా శునకాలకు ట్రైనింగ్‌

తమపై ఎటువంటి దాడి జరగలేదని.. ఎలాగైనా ఫేమస్‌ కావాలనే ఉద్దేశంతో కుమార్‌ ఈ నాటకానికి తెరతీసినట్లు సైనికుడి స్నేహితుడు పోలీసులకు వెల్లడించాడు. ఆ సమయంలో తాను మద్యం మత్తులో ఉన్నానని.. స్నేహితుడు చెప్పినట్లుగా అతడి వీపుపై పీఎఫ్‌ఐ అని రాసినట్లు తెలిపాడు. అనంతరం కుమార్‌ తనని కొట్టాలని చెప్పినప్పటికీ.. తాగి ఉన్నందున ఆ పనిచేయలేదన్నాడు. చేతులు, మూతికి మాత్రం ప్లాస్టర్‌ వేసినట్లు అంగీకరించాడు. అతడి ఇంటి నుంచి ఆకుపచ్చ రంగు డబ్బా, ఓ బ్రష్‌, టేపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం ఫేమస్‌ అయ్యేందుకే కుమార్‌ ఇదంతా చేసినట్లు మీడియాతో వివరించాడు. అయితే, సైనికుడు మాత్రం ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని చెప్పాడని.. వాటిని పరిశీలిస్తున్నట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి వెల్లడించారు. ఇరువురి స్టేట్‌మెంట్లను రికార్డు చేసుకున్నామని.. ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. పూర్తి విచారణ తర్వాత తదుపరి చర్యలు ఉంటాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని