Kathua Attack: 2 గంటలు, 5189 రౌండ్ల కాల్పులు.. సైన్యం ప్రతిఘటనతో ఉగ్రవాదులు పరార్‌!

కఠువాలో సైనిక వాహనంపై సాయుధ మూకలు దాడి మొదలుపెట్టిన వెంటనే స్పందించిన భారత జవాన్లు.. ప్రతిదాడులతో విరుచుకుపడినట్లు వెల్లడైంది.

Published : 10 Jul 2024 18:24 IST

దిల్లీ: జమ్మూ-కశ్మీర్‌లో సైనిక వాహనంపై ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడిన ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే, తమ వాహనంపై సాయుధ మూకలు దాడి మొదలుపెట్టిన వెంటనే స్పందించిన భారత సైన్యం.. ప్రతిదాడులతో విరుచుకుపడింది. గాయపడిన సైనికులను రక్షించుకోవడంతోపాటు మరింత ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో భారత సైన్యంలోని ‘22 గడ్వాల్‌ రెజిమెంట్‌’ దాదాపు 5189 రౌండ్ల కాల్పులు జరిపినట్లు వెల్లడైంది. దాంతో తోకముడిచిన ఉగ్రమూకలు సమీప అడవుల్లోకి పారిపోయినట్లు తెలిసింది.

కఠువాకు 150కి.మీ దూరంలో ఉన్న బద్‌నోతా గ్రామ సమీపంలోని మాచేడీ- కిండ్లీ- మల్హార్‌ రోడ్డులో రెండు సైనిక వాహనాలపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు వారిని దీటుగా ఎదుర్కొనేందుకు ఎదురు కాల్పులు జరిపారు. అప్పటికే ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న జవాన్లు.. మరింత ప్రాణనష్టం జరగకుండా నిరోధించడంతోపాటు ఆయుధాలను ఎత్తుకెళ్లిపోకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రతిఘటించారు. అదనపు బలగాలు అక్కడకు చేరుకునే వరకు నిరంతరంగా కాల్పులు కొనసాగించారు. ఓ సైనికుడి చేతికి తీవ్రంగా గాయమైనప్పటికీ తన ఆయుధం జామ్‌ అయ్యేవరకు ఒక్క చేతితోనే కాల్పులు కొనసాగించడం గమనార్హం.

మీ త్యాగాలు వృథాపోవు.. ముష్కరులపై ప్రతీకారం తీర్చుకుంటాం

దాడికి సంబంధించి అసలు అక్కడ ఏం జరిగిందనే విషయంపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఘటనాస్థలంలో రక్తంతో తడిసిన హెల్మెట్లు, పగిలిన వాహనాల టైర్లు, రక్షణ కవచాలను పరిశీలించారు. వాటిని చూసి ఏస్థాయిలో పోరు జరిగిందో స్పష్టంగా అర్థమవుతుందని ఓ అధికారి పేర్కొన్నారు. ఇలా ఉగ్రవాదులకు-జవాన్లకు మధ్య రెండు గంటలకుపైగా కాల్పులు జరిగాయన్నారు. ముగ్గురు ఉగ్రవాదులు వేర్వేరు ప్రదేశాల్లో దాక్కొని సైనిక వాహనాలు, బలగాలే లక్ష్యంగా దాడులకు తెగబడినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. ఇలా కఠువాలో సైనిక వాహనంపై భీకర దాడుల ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. సైనికుల త్యాగాలు వృథాకావని, ఘాతుకానికి పాల్పడినవారి అంతు చూస్తామని రక్షణ శాఖ పేర్కొంది. తగినరీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతినబూనింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని