Bhole Baba: ‘క్యానులో ఏదో తెచ్చి చల్లారు’.. భోలే బాబా లాయర్‌ ఆరోపణ

సత్సంగ్‌ జరిగే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు డబ్బాల్లో విష పదార్థాన్ని తీసుకువచ్చినట్లు కొందరు తనతో చెప్పారని, దాన్ని చల్లడం వల్లే అనేక మంది సొమ్మసిల్లి ప్రాణాలు కోల్పోయారని భోలే బాబా తరఫు న్యాయవాది ఆరోపించారు.

Published : 07 Jul 2024 19:30 IST

దిల్లీ: హాథ్రస్‌లో 121 మంది మరణానికి కారణమైన తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో భోలే బాబా న్యాయవాది కీలక ఆరోపణలు చేశారు. సత్సంగ్‌ జరిగే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు డబ్బాల్లో విష పదార్థాన్ని తీసుకువచ్చినట్లు కొందరు చెప్పారని, దాన్ని చల్లడం వల్లే అనేక మంది సొమ్మసిల్లి ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. తొక్కిసలాట వెనుక కుట్ర ఉందని, భోలే బాబాకు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే ఇదంతా చేశారని అన్నారు.

‘‘విష పదార్థమున్నట్లు భావిస్తోన్న ఓ క్యానును కొందరు వ్యక్తులు తీసుకువచ్చారు. జనాల మధ్యకు వచ్చి దాన్ని తెరిచారు. అనంతరం, వారు తప్పించుకునేందుకు వీలుగా ముందస్తుగానే కొన్ని వాహనాలను ఓ చోట సిద్ధం చేసుకున్నారు. ఘటన తర్వాత వెళ్లిపోయారు. ఇదే విషయాన్ని కొందరు సాక్షులు నాతో చెప్పారు. వారికి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నాం’’ అని భోలే బాబా తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ పేర్కొన్నారు. మృతదేహాలపై ఎటువంటి గాయాలు లేవని.. ఊపిరాడకే మరణించినట్లు పోస్టుమార్టం నివేదికల్లో వచ్చిందన్నారు. దీని వెనుక కుట్ర ఉందన్న సింగ్‌.. అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించి ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ పరిణామంపై తొలిసారి మాట్లాడుతున్నామని, వీటిని త్వరలోనే దర్యాప్తు సంస్థలకు అందిస్తామని చెప్పారు.

ఎవరీ ‘భోలే బాబా’..? హాథ్రస్‌ తొక్కిసలాటకు కారణమేంటి?

కీలక నిందితుడు దేవ్‌ప్రకాశ్‌ సహా తొమ్మిదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కార్యక్రమం నిర్వహణకు ఓ రాజకీయ పార్టీ నిధులు సమకూర్చిందనే విషయంపైనా దర్యాప్తు చేస్తున్నామని, నిజమని తేలితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై అవసరమైతే బాబాను కూడా విచారిస్తామని దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్‌ కమిషన్‌ పేర్కొంది. దుర్ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు  సమర్పించాలని పౌరులకు సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని