Pfizer: అమెరికా టీకాలకు అడ్డంకులేంటీ..?

ఒక పక్క కొవిడ్‌ సెండ్‌ వేవ్‌ ప్రళయం సృష్టించి ఇప్పడిప్పుడే నెమ్మదిస్తోంది.. మరోపక్క థర్డ్‌ వేవ్‌ కొన్ని నెలల్లోనే పడగ విప్పుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సింగపూర్‌ వంటి చోట్ల ఇప్పటికే ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి.

Updated : 28 May 2021 12:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఒక పక్క కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రళయం సృష్టించి ఇప్పుడిప్పుడే నెమ్మదిస్తోంది.. మరోపక్క థర్డ్‌ వేవ్‌ కొన్ని నెలల్లోనే పడగ విప్పుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సింగపూర్‌ వంటి చోట్ల ఇప్పటికే ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌కు అడ్డుకట్ట వేసే అస్త్రం టీకా మాత్రమే. భారత్‌ పరిస్థితి చూస్తే మరికొన్ని నెలల పాటు టీకా ఉత్పత్తిలో పురోగతి కనిపించే అవకాశం లేదు. అమెరికా వద్ద గోదాముల్లో పడి వున్న ఆరు కోట్ల ఆస్ట్రాజెనెకా టీకాలు భారత్‌కే వస్తాయన్న గ్యారెంటీ లేదు.  ఈ నేపథ్యంలో మరిన్ని టీకా కంపెనీలను దేశంలోకి రప్పించే ప్రయత్నాలు అనుకున్నంత వేగంగా జరగడంలేదు.

ఇప్పటి వరకు రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి మాత్రమే భారత్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పటికైతే అత్యవసర వినియోగానికి డోసులు దిగుమతి చేసుకుంటున్నారు. త్వరలోనే దేశీయంగా తయారైన డోసులు అందుబాటులోకి రానున్నాయి. సార్స్‌కోవ్‌-2 వైరస్‌పై అత్యధిక ప్రభావం చూపిస్తున్న అమెరికా కంపెనీల టీకాల విషయం ఇంకా తేలలేదు. ‘‘ప్రభుత్వం 2020 మధ్య నుంచే ఫైజర్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, మోడెర్నాలతో చర్చలు జరుపుతోంది’’  ఇది నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వి.కె. పాల్‌ ‘భారత వ్యాక్సినేషన్‌పై అవాస్తవాలు.. వాస్తవాలు’ అనే ప్రకటనలో పేర్కొన్న అంశం. వీటిల్లో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా మాత్రమే భారత్‌కు వచ్చే అవకాశం ఉంది.  దీనిపై హెల్త్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ‘‘ఫైజర్‌, మోడెర్నాలకు రెగ్యూలేషన్‌ విషయాల్లో సహకరిస్తామని చెప్పాం. కొనుగోలు అంశాల్లో కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. వారి వద్ద అదనంగా ఉన్న టీకాలను తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని వెల్లడించారు.

అమెరికా, ఇజ్రాయెల్‌, బ్రిటన్‌ వంటి దేశాల్లో కనీసం 50 శాతం మందికి ఒక్క డోసు టీకా పడటంతో వైరస్‌ వ్యాప్తి గణనీయంగా తగ్గిపోయింది. భారత్‌లో 130 కోట్ల మందిలో 50శాతం మందికి ఒక్క టీకా పడాలన్నా కనీసం 75 కోట్లు ఉత్పత్తి కావాలి. రెండు డోసులు అంటే 140 కోట్లు అవసరం.  డిసెంబర్‌ నాటికి 216 కోట్ల టీకాలను ఉత్పత్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ప్రముఖ వైరాలజిస్టు గగన్‌దీప్‌ కాంగ్‌ వంటి  వారు ప్రభుత్వ లెక్కలపై పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో బయట కొనగోళ్లు ప్రభుత్వాలకు తప్పనిసరి.

ఫైజర్‌తో చర్చల్లో చిక్కుముడి ఇది..

కొవిడ్‌పై అత్యధిక సామర్థ్యం చూపిస్తున్న టీకా ఇది. దీనిని మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీతో అభివృద్ధి చేశారు. ఇది పూర్తిగా కొత్తది. భారత్‌లో 5 కోట్ల డోసులు సరఫరా చేయడానికి ఈ సంస్థ సానుకూలంగానే ఉంది. కానీ, పలు సాంకేతిక, వాణిజ్య సమస్యలు అడ్డంకిగా మారాయి. కొన్ని నెలల నుంచి వీటిపై చర్చలు జరుగుతున్నా ఓ కొలిక్కి రాలేదు. వీటిల్లో అత్యంత కీలకమైనది ఇండెమ్నిటి సమస్య.

తేలని ఇండెమ్నిటి..

ఫైజర్‌ భారత్‌కు టీకాలు సరఫరా చేశాక వాటిపై ఏమైనా న్యాయపరమైన చిక్కులు, నష్టపరిహారల అంశాలు వస్తే భారత ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుతోంది. భారత ప్రభుత్వం దీనికి కొంత వరకు మాత్రమే హామీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. తొలుత పూర్తి స్థాయి బాధ్యత తీసుకోవడానికి విముఖంగా ఉంది. సాధారణంగా టీకాలను విడుదల చేయడానికి ఏళ్లు పడతాయి. ప్రభుత్వాల ఒత్తిళ్ల కారణంగా హడావుడిగా టీకాలు విడుదల చేశారు. దీంతో ఏవైనా జరగకూడని ఘటనలు జరిగితే రక్షణ కోసం కోరుతోంది. పైగా ఎంఆర్‌ఎన్‌ఏ టీకా కొత్తది. తాజా పరిణామాల నేపథ్యంలో డీల్‌కు అత్యంత దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ అంశానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘నో ఫాల్ట్‌’ పరిష్కారం చెప్పింది. కొవిడ్‌ వ్యాక్సిన్ల దుష్ఫ్రాభావాలు ఏమైనా ఉంటే బాధితులు కోర్టుకు వెళ్లకుండానే పరిహారం అందజేయాలని పేర్కొంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాలు ఇండెమ్నిటి, నోఫాల్ట్‌ అంశాలకు ఒప్పుకొన్నాయి. వీటిల్లో అమెరికా, ఐరోపా సంఘం, కెనడా, జపాన్‌, అర్జెంటీనా వంటి దేశాలు ఉన్నాయి. గావీ కోవాక్స్‌ అలయన్స్‌ కూడా దీనికి అంగీకరించింది.

త్వరలోనే కొన్ని ఫైజర్‌ డోసులు..

భారత్‌కు త్వరలోనే కొన్ని ఫైజర్‌ డోసులు అందనున్నట్లు నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు. జులై నాటికి ఇవి భారత్‌కు చేరుకొనే అవకాశం ఉందన్నారు.   ఇండెమ్నిటి అంశానికి సంబంధించి చర్చిస్తున్నామన్నారు. అంతేకాదు వారు మా నుంచి ఏమీ ఆశిస్తున్నారు.. మేము వారి నుంచి ఏమి కోరుకుంటున్నామో ఆ అంశాలపై చర్చిస్తున్నట్లు చెప్పారు. వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు.  కోల్డ్‌చైన్‌ ఏర్పాట్లకు సంబంధించి మాట్లాడుతున్నామన్నారు. వారు సొంత దేశంతో సహా ప్రతి చోటా ఇండెమ్నిటి అడిగారు.. ప్రజాశ్రేయస్సు, అవసరాలను దృష్టిలోపెట్టుకొని దీనిపై ఆలోచిస్తాన్నారు. తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. 

భారత్‌ ఇప్పటికే కొన్ని అమెరికా, ఐరోపా, ప్రపంచ ఆరోగ్య సంస్థ, జపాన్‌ వంటి దేశాలు ఆమోదించిన టీకాలకు భారత్‌లో ప్రయోగ పరీక్షలు లేకుండా 3 రోజుల్లో అనుమతి ఇచ్చేందుకు అంగీకరించింది.

ఈ పని ముందే చేస్తే మరిన్ని జీవితాలను కాపాడే వారుగా అన్న ప్రశ్నకు ఇటీవల ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గులేరియా స్పందిస్తూ..‘‘కొన్ని దేశాల ఎఫ్‌డీఏలు ఆమోదించిన టీకాలకు భారత్‌ పరీక్షలు అవసరం లేకుండా అనుమతులు ఇవ్వవచ్చు. కానీ, భారత ప్రజల్లో తలెత్తే సైడ్‌ ఎఫెక్ట్స్‌ను గుర్తించకుండా అనుమతులు ఇస్తే తర్వాత విమర్శలు వస్తాయి. దానిని సమర్థించుకోలేం’’ అని తెలిపారు. 

మోడెర్నా వచ్చే ఏడాదే..

మోడెర్నా వద్ద ఇప్పటికే భారీగా ఆర్డర్లు ఉన్నాయి. దీంతో 2021లో భారత్‌కు విక్రయించేందుకు తమ వద్ద మిగులు వ్యాక్సిన్లు లేవని భారత అధికారులకు మోడెర్నా వెల్లడించింది. కాకపోతే భారత్‌కు 2022 నుంచి సింగల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ విడుదల చేసేందుకు మోడెర్నా రంగం సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే  ఫార్మా దిగ్గజం సిప్లాతో చర్చలు జరుపుతోంది.

భారత్‌ ఆశలు వీటిపైనే..

* భారత్‌ బయోటెక్‌ సంస్థ నాసికా రంధ్రాల ద్వారా ఉపయోగించే టీకాపై ప్రయోగాలు చేపట్టింది. 2021లోనే ఇది అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఈ వ్యాక్సిన్‌ సమర్థవంతమైన విధానంగా భావిస్తున్నారు.

* హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఈ సంస్థ మూడోదశ ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇవి పూర్తయితే ఈ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

* ఫార్మా దిగ్గజం జైడస్‌ క్యాడిల్లా కూడా జైకోవ్‌-డీ పేరుతో అభివృద్ధి చేస్తున్న టీకా 3వ దశ ప్రయోగాలు జరుపుకొంటోంది. కొన్ని నెలల్లో ఇది  అందుబాటులోకి రానుంది.

* జెన్నోవా బయోఫార్మా ఆర్‌ఎన్‌ఏ టీకా, స్పుత్నిక్‌ సింగల్‌ డోస్‌, నొవావ్యాక్స్‌ వంటి వాటిపై ప్రభుత్వం ఆశలు పెట్టుకొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు