Pegasus : అది ఎవరో చేసిన చెత్తపని..!

భారత్‌ సహా ప్రపంచ దేశాల్లోని నాయకుల ఫోన్లపై నిఘా పెట్టిన వ్యవహారంపై పెగాసస్‌ రూపుకర్త ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ వ్యవస్థాకుడు షలీవ్‌ హులియో స్పందించారు

Published : 24 Jul 2021 01:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ సహా ప్రపంచ దేశాల్లోని నాయకుల ఫోన్లపై నిఘా పెట్టిన వ్యవహారంపై పెగాసస్‌ రూపకర్త ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ వ్యవస్థాకుడు షలీవ్‌ హులియో స్పందించారు. ఆయన ‘ది వాషింగ్టన్‌ పోస్టు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ కంపెనీ ఎంతో మంది జీవితాలను కాపాడిందని చెప్పుకొచ్చారు. నాయకులపై నిఘా వ్యవహారం కొందరు చేసిన చెత్తపనిగా ఆయన అభివర్ణించారు.  జాతీయ భద్రత, నిఘా సంస్థల రోజువారీ పనిపై మరింత అవగాహన రావాల్సి ఉందన్నారు. ఈ విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన గురించే మాట్లాడటం తనను బాధపెడుతోందన్నారు. తమ సాఫ్ట్‌వేర్‌ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ప్రాణాలు కాపాడిందో చెప్పగలమన్నారు. కానీ, ఆ విషయాలను ప్రస్తావించదలుచుకోలేదని షలీవ్‌ వెల్లడించారు. కొంత మంది వినియోగదారులు తమ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేసిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కానీ, ఆయన ఎవరి పేరును వెల్లడించలేదు. సౌదీ, దుబాయ్‌, మెక్సికోలోని కొన్ని ఏజెన్సీలకు సహా ఐదుగురు కస్టమర్లకు ఈ సాఫ్ట్‌వేర్‌ విక్రయించడం ఆపేశామన్నారు. అసాంఘిక శక్తుల ఆటకట్టించడానికే దీనిని తయారు చేసినట్లు వెల్లడించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను వాడి మెక్సికో మాదకద్రవ్యాల ఎగుమతిదారు ఎల్‌ ఛాపోను రెండు సార్లు అరెస్టు చేసిందన్నారు. ‘‘క్రిమినల్స్‌, ఉగ్రవాదుల సమాచారం సంపాదించి వారి ఆటకట్టించేందుకు ఇంతకంటే మంచి మార్గం ఎవరైనా సూచిస్తే..  నా కంపెనీని, పెగాసస్‌ను పూర్తిగా మూసివేస్తాను’’ అని షలీవ్‌ పేర్కొన్నారు. 

ఎన్‌ఎస్‌వో కంపెనీని స్మార్ట్‌ఫోన్లలో సమస్యలు పరిష్కరించేందుకు తొలుత ఏర్పాటు చేశారు. ఆ తర్వాత షలీవ్‌, కంపెనీలో మరో భాగస్వామి ఒమ్రి లావిని ఇజ్రాయిల్‌ అధికారులు కలిసి.. వారికి అవసరమైన ఒక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయించుకొన్నారు. ఆ తర్వాత మెల్లగా ఎన్‌ఎస్‌వో కంపెనీ ఎదగడం మొదలైంది. ప్రస్తుతం ఈ కంపెనీలో 750 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.  1.5 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని