ఆ కేంద్రమంత్రిపై పోటీ చేస్తా.. లఖింపుర్‌ ఖేరి ఘటనలో మృతిచెందిన రైతు కుమారుడి ప్రకటన

2024లో యూపీలో జరిగే లోక్​సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రాపై పోటీ చేస్తానని లఖింపుర్ ఖేరీ ఘటనలో మృతిచెందిన రైతు నచతార్ సింగ్ కుమారుడు......

Published : 06 Feb 2022 02:08 IST

లఖ్‌నవూ: 2024లో యూపీలో జరిగే లోక్​సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రాపై పోటీ చేస్తానని లఖింపుర్ ఖేరీ ఘటనలో మృతిచెందిన రైతు నచతార్ సింగ్ కుమారుడు జగదీప్ సింగ్ ప్రకటించారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సమాజ్​వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కోరాయని.. లోక్​సభ ఎన్నికల్లోనే పోటీ చేయాలనే ఉద్దేశంతోనే వారి ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు జగదీప్ సింగ్ తెలిపారు. 

‘లఖింపుర్​ ఖేరిలోని దౌరాహరా స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా ఎస్పీ, కాంగ్రెస్ నన్ను సంప్రదించాయి. కానీ నేను ఈ చిన్న యుద్ధాల్లో పాల్గొనని చెప్పా. 2024 లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వమని అడిగా. నేను అజయ్​ మిశ్రాపై ప్రత్యక్షంగా పోటీచేస్తా. నేను పోరాడాలి. సరైన పద్ధతిలో పోరాడతా’ అని జగదీప్ సింగ్ తెలిపారు. తన కుటుంబంలో ఎవరికీ రాజకీయ నేపథ్యం లేదన్నారు జగదీప్. తాను ఏ పార్టీకీ మద్దతు ఇవ్వడం లేదని, రైతు నాయకుడు తేజేందర్ సింగ్​కు ప్రస్తుతం తాము మద్దతుగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రంపై జగదీప్ మండిపడ్డారు. బ్రాహ్మణుల ఓటు బ్యాంకు కోసమే అజయ్ మిశ్రాను కేంద్రం పదవి నుంచి తొలగించలేదన్నారు. మిశ్రా పదవిలో ఉన్నంతకాలం తమకు న్యాయం జరగదని ఆవేదన వ్యక్తం చేశారు.

గతేడాది అక్టోబర్ 3న లఖింపుర్​లో నిరసన తెలియజేస్తున్న రైతులపైకి మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం చెలరేగిన హింసలో ఓ జర్నలిస్ట్ సహా నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆశిష్‌ మిశ్రా సహా పలువురిని సిట్ అరెస్టు చేసింది. ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రా ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని