Rajasthan Crisis: పరిస్థితిని సోనియాకు చెప్పాం.. రాతపూర్వక నివేదిక అడిగారు!

రాజస్థాన్‌(Rajasthan) కాంగ్రెస్‌లో సంక్షోభం కొనసాగుతున్న వేళ ఆ పార్టీ సీనియర్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే, అజయ్‌ మాకెన్‌ సోనియా గాంధీతో భేటీ....

Updated : 26 Sep 2022 21:07 IST

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాతో అజయ్‌ మాకెన్‌, ఖర్గే భేటీ

దిల్లీ: రాజస్థాన్‌(Rajasthan) కాంగ్రెస్‌లో సంక్షోభం కొనసాగుతున్న వేళ ఆ పార్టీ సీనియర్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే, అజయ్‌ మాకెన్‌ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. రాజస్థాన్‌కు కేంద్ర పరిశీలకులుగా వెళ్లిన వీరిద్దరూ అక్కడి పరిణామాలపై ఆమెతో చర్చించారు. సోనియాతో భేటీ తర్వాత రాజస్థాన్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి అజయ్‌ మాకెన్‌ మీడియాతో మాట్లాడారు. రాజస్థాన్‌ పరిణామాలను సోనియాకు వివరించామన్నారు. అయితే, వీటిపై ఆమె లిఖితపూర్వకంగా సమగ్ర నివేదిక కోరారని.. ఈ రాత్రికో, రేపో నివేదికను ఆమెకు అందజేయనున్నట్టు వెల్లడించారు. రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం జరగకపోవడం దురదృష్టకరమన్నన్న మాకెన్‌.. గహ్లోత్‌ వర్గం ఎమ్మెల్యేలు క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరించడం బాధాకరమని పేర్కొన్నారు. 

గహ్లోత్‌ సమ్మతితోనే ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశామని.. సమయం, వేదిక కూడా ఆయన చెప్పినట్టుగానే చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాగే, గహ్లోత్‌కు విధేయులైన ఎమ్మెల్యేల డిమాండ్లను సోనియా ముందు ఉంచినట్టు చెప్పారు. 102 మంది ఎమ్మెల్యేలు తమలో ఒకరిని సీఎంని చేయాలని తమతో చెప్పారని.. వారి అభిప్రాయాన్ని సోనియా దృష్టికి తీసుకెళ్తామని వారికి నిన్న చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా  వెల్లడించారు. ఈ వ్యవహారంపై సంప్రదింపుల తర్వాత సోనియా గాంధీయే నిర్ణయం తీసుకుంటారని ఎమ్మెల్యేలకు తాము చెప్పినట్టు మాకెన్‌ తెలిపారు. ఎమ్మెల్యేలందరితోనూ విడివిడిగా సమావేశం కావాలని తమకు సోనియా సూచించారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని