CWC Meet: కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సోనియానే.. సీడబ్ల్యూసీ భేటీలో నిర్ణయం

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన నేడు జరిగిన పార్టీ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ముగిసింది. దాదాపు ఐదు గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో......

Updated : 13 Mar 2022 22:13 IST

నాలుగు గంటలకు పైగా కొనసాగిన సమావేశం

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే మరికొంత కాలం పాటు కొనసాగనున్నారు. సంస్థాగత ఎన్నికల జరిగే వరకు ఆమె నేతృత్వంలోనే పార్టీ ముందుకు వెళ్లనుంది. ఈ మేరకు ఆదివారం సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన పార్టీ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దాదాపు నాలుగు గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ప్రధానంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు, అధ్యక్ష ఎన్నికల గురించి చర్చ జరిగింది. సమావేశం అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సమావేశం వివరాలను వెల్లడించారు.

ఐదు రాష్ట్రాల్లో ఓటములకు గల కారణాలను ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. భాజపా ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో పార్టీ విఫలమైందని సమావేశం అభిప్రాయ పడినట్లు వెల్లడించారు. పంజాబ్‌లో సీఎం మార్పు తర్వాత తీసుకోవాల్సిన చర్యలను అమలు చేయడంలో పార్టీ విఫలమైందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైనట్లు పేర్కొన్నారు. లోపాలను సరిదిద్దుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయించడంతో పాటు, అధ్యక్షురాలిగా సోనియానే పార్టీని ముందుండి నడిపించాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో పోటీకి పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నట్లు చెప్పారు.

హాజరైన అసమ్మతి నేతలు..

ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానికి అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, చిదంబరం వంటి సీనియర్‌ నేతలు హాజరయ్యారు. వీరితోపాటు గులాంనబీ ఆజాద్‌, మనీశ్‌ తివారీ, ఆనంద్‌ శర్మ వంటి అసమ్మతి నేతలు కూడా హాజరయ్యారు. అనారోగ్య కారణాల దృష్ట్యా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హాజరు కాకపోగా, మాజీ రక్షణాశాఖ మంత్రి ఏకే ఆంటోనీకి కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో ఈ భేటీకి రాలేకపోయారు. పలు వ్యక్తిగత కారణాలతో మరో ముగ్గురు సీనియర్‌ నేతలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

రాహుల్‌కి మద్దతుగా..

కీలక సమావేశం నేపథ్యంలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బఘేల్‌తోపాటు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ సహా పలువురు నేతలు రాహుల్‌ గాంధీనే పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని మరోసారి ఉద్ఘాటించారు. మరోవైపు ఈ కీలక భేటీ సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. ఒకవేళ పార్టీ అధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తే రాహుల్‌ గాంధీనే అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని నినాదాలు చేస్తూ మద్దతు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని