Sonia Gandhi: ఈడీ ముందు సోనియా గాంధీ హాజరు కానట్లేనా..?

సోనియా గాంధీ కొవిడ్‌ బారినపడడంతో దర్యాప్తు సంస్థ ఈడీ ఎదుట హాజరయ్యే అవకాశం లేకపోవచ్చని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Published : 07 Jun 2022 22:27 IST

దిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కేసులో కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియా గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం నాడు (జూన్‌ 8) ఈడీ ముందు ఆమె హాజరు కావాల్సి ఉంది. ఇదే సమయంలో సోనియా గాంధీ కొవిడ్‌ బారినపడడంతో దర్యాప్తు సంస్థ ఎదుట హాజరయ్యే అవకాశం లేకపోవచ్చని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇందుకు సంబంధించి ఈడీకి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం ఇవ్వనప్పటికీ.. ఆరోగ్య సమస్యల దృష్ట్యా మినహాయింపు పొందే ఆస్కారం ఉందని పేర్కొంటున్నారు.

ఇదిలాఉంటే, నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా, రాహుల్‌ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)  జూన్‌ 1న నోటీసులు పంపించింది. ఈ కేసులో వారిద్దరి స్టేట్‌మెంట్లను రికార్డు చేసేందుకే సమన్లు జారీ చేసినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. అయితే, నోటీసులు పంపించిన మరుసటి రోజే సోనియా గాంధీ కొవిడ్‌ బారినపడ్డారు. అయినప్పటికీ ఈడీ దర్యాప్తునకు ఆటంకం కలుగదని కాంగ్రెస్‌ పార్టీ అప్పట్లో పేర్కొంది. గడువులోగా కోలుకొని ఈడీ ముందు హాజరవుతారని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా ఆశాభావం తెలిపారు. కానీ, సోనియా గాంధీ ఇప్పటికీ కోలుకోకపోవడంతో దర్యాప్తు సంస్థ ముందు హాజరుకాకపోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు రాహుల్‌ గాంధీ మాత్రం జూన్‌ 13న ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని