Sonia Gandhi: సోనియాతో ముగిసిన ఈడీ విచారణ.. మళ్లీ పిలుస్తారా?

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi)తో ఈడీ విచారణ గురువారం ముగిసింది. నేషనల్‌ హెరాల్డ్‌ (National Herald)కు సంబంధించిన మనీ లాండరింగ్‌........

Updated : 21 Jul 2022 17:35 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi)తో ఈడీ విచారణ గురువారం ముగిసింది. నేషనల్‌ హెరాల్డ్‌ (National Herald)కు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో దాదాపు రెండు గంటలకు పైగా అధికారులు ఆమెను విచారించారు. ఈ కేసులో ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. 75 ఏళ్ల సోనియా గాంధీ ఇటీవల కొవిడ్‌ నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణలో పాల్గొన్న అధికారుల బృందం కొవిడ్‌ నిబంధనలు పాటించింది. సోనియాను ప్రశ్నించేందుకు మహిళా జాయింట్‌ డైరెక్టర్‌ సారథ్యంలోని ఐదుగురు అధికారుల బృందం 50 ప్రశ్నలు రూపొందించినట్టు తెలిసింది.

ఈ రోజు మధ్యాహ్నం సెంట్రల్‌ దిల్లీలోని అబ్దుల్‌ కలాం రోడ్డులోని ఈడీ ప్రధాన కార్యాలయానికి సోనియా గాంధీ తన జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతతో చేరుకోగా.. 12.30గంటలకు విచారణ మొదలైంది.  సోనియా వెంట ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) ఉన్నారు. వీరు ఈడీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత.. సోనియా విచారణ గదిలోకి వెళ్లారు. అటు రాహుల్‌ గాంధీ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చి కాసేపటికే అక్కడి నుంచి వెళ్లిపోయారు. సోనియా ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆమెకు సహకారిగా ఉండేందుకు ప్రియాంకకు ఈడీ అనుమతినిచ్చింది. అయితే విచారణ గదిలో కాకుండా మరో గదిలో ఉండాలని సూచించింది. కొవిడ్ లక్షణాలతో సోనియా ఇటీవల ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. వైరస్‌ నుంచి కోలుకున్నప్పటికీ.. కొవిడ్‌ అనంతర సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. ప్రతి మూడు నాలుగు గంటలకోసారి నెబ్యులైజేషన్‌ తీసుకోవాల్సిన అవసరం ఉండటంతో ప్రియాంకను ఈడీ కార్యాలయం లోపలికి అధికారులు అనుమతించారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలిని దర్యాప్తు సంస్థలు విచారించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదే కేసులో ఇటీవల రాహుల్‌ గాంధీని కూడా ఈడీ విచారించిన విషయం తెలిసిందే. మొత్తం 5 రోజుల్లో 10 గంటలపాటు రాహుల్‌ను అధికారులు ప్రశ్నించారు.

రైళ్లు ఆపి.. కారుకు నిప్పు పెట్టిన కాంగ్రెస్‌ శ్రేణులు

సోనియాగాంధీని ఈడీ ప్రశ్నించడంపై కాంగ్రెస్‌ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. రాజకీయ ప్రతీకార చర్యగా పేర్కొంటూ బెంగళూరులో యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు కారుకు నిప్పంటించారు. ఈ ఘటనలో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. మరోవైపు, దిల్లీలోని శివాజీ బ్రిడ్జి రైల్వేస్టేషన్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలు మూడు రైళ్లను అడ్డుకున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్‌ నాయకులు అధిర్‌ రంజన్‌ చౌధరీ, సచిన్ పైలట్‌, అశోక్‌ గెహ్లోత్‌ తదితరులు ఆందోళనల్లో పాల్గొనగా.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ ఆందోళనలు చేపట్టింది. అటు పార్లమెంట్‌లోనూ ఈ విషయంపై కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని