ఒకే డోసు సామర్థ్యంపై త్వరలో ప్రయోగాలు

దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత ఇంకా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో దీన్ని అధిగమించేందుకు పలు కీలక చర్యలు తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా వ్యాక్సిన్ల మిక్సింగ్‌ (రెండు వేర్వేరు డోసులు తీసుకోవడం)తో పాటు ఒకే డోసు కొవిషీల్డ్‌ టీకా ఇవ్వడంపై అధ్యయనం జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది

Updated : 31 May 2021 22:23 IST

దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత ఇంకా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో దీన్ని అధిగమించేందుకు పలు కీలక చర్యలు తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా వ్యాక్సిన్ల మిక్సింగ్‌ (రెండు వేర్వేరు డోసులు తీసుకోవడం)తో పాటు ఒకే డోసు కొవిషీల్డ్‌ టీకా ఇవ్వడంపై అధ్యయనం జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది.

రెండు వేర్వేరు డోసులు కలిపి ఇచ్చే అంశంపై జూన్‌లో అధ్యయనం ప్రారంభం కానున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. రెండు నుంచి రెండున్నర నెలల్లో ఈ పరిశోధన పూర్తి కానున్నట్లు సమాచారం. ఇటీవల పొరపాటున 20 మందికి రెండు వేర్వేరు వ్యాక్సిన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, వారిలో పెద్దగా దుష్ప్రభావాలేమీ తలెత్తకపోవడంతో వ్యాక్సిన్‌ మిక్సింగ్‌పై చర్చ ప్రారంభమైంది. దీనిపై లోతైన పరిశోధన జరగాల్సి ఉందని నీతి ఆయోగ్‌ (ఆరోగ్యం) సభ్యుడు వి.కె.పాల్‌ తెలిపారు. జులై మధ్య నాటికి రోజుకు కోటి మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ అధ్యయనం కీలకంగా మారనుంది.

ఇక కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య వ్యవధిని పొడిగించిన నేపథ్యంలో దీనిపైనా పరిశోధన జరపాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా ఒక డోసు వల్ల శరీరంలో ఏ మేర రోగ నిరోధకత ఏర్పడనుందో పరీక్షించనున్నారు. ఒక డోసు వల్ల కరోనాను బాగా ఎదుర్కొనగలిగే సామర్థ్యం ఏర్పడుతుందని తేలితే.. వ్యాక్సిన్‌ కొరత సమస్యకు ఓ పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ సంయుక్తంగా రూపొందించిన కొవిషీల్డ్‌ టీకాను తొలుత ఒకే డోసు కాన్సెప్ట్‌తో రూపొందించారు. కానీ, టీకా ప్రభావానికి సంబంధించిన పరీక్షల్లో రెండు డోసులు అత్యధిక సామర్థ్యాన్ని కనబరుస్తున్నట్లు తేలడంతో రెండు డోసుల వ్యాక్సిన్‌గా మార్కెట్లోకి తీసుకొచ్చారు.

ఇక జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ రూపొందించిన టీకాతో పాటు స్పుత్నిక్ లైట్‌ టీకా సింగిల్‌ డోసు వ్యాక్సిన్లే కావడం గమనార్హం. ఈ వ్యాక్సిన్ల తయారీలోనూ ఆస్ట్రాజెనెకా టీకా ఉత్పత్తిలో వినియోగించిన సాంకేతికతనే వాడుకోవడం గమనార్హం. మరోవైపు బయోలాజికల్‌-ఇ తయారు చేస్తున్న జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, సీరం రూపొందించిన మరో వ్యాక్సిన్‌ నొవావాక్స్‌, జెనోవా, జైడస్‌ క్యాడిలా రూపొందించిన వ్యాక్సిన్లూ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వ్యాక్సిన్ల కొరతకు రానున్న కొన్ని నెలల్లో పరిష్కారం లభించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని