Omicron: ఒమిక్రాన్‌ రోగుల్లో కనిపిస్తున్న లక్షణమిది..!

ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తుల్లో సాధారణ కనిపిస్తున్న ఓ లక్షణాన్ని దక్షిణాఫ్రికాలో వైద్య నిపుణులు గుర్తించారు. ఆ దేశానికి చెందిన డిస్కవరీ హెల్త్‌ సీఈవో రేయాన్‌ నోచ్‌

Updated : 21 Dec 2021 15:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తుల్లో సాధారణ కనిపిస్తున్న ఓ లక్షణాన్ని దక్షిణాఫ్రికాలో వైద్య నిపుణులు గుర్తించారు. ఆ దేశానికి చెందిన డిస్కవరీ హెల్త్‌ సీఈవో రేయాన్‌ నోచ్‌ మాట్లాడుతూ.. ఒమిక్రాన్‌ సోకిన వారిలో స్వల్పంగా విభిన్న లక్షణాలు బయటపడుతున్నాయని వెల్లడించారు. ముఖ్యంగా వైరస్‌ సోకిన వారికి తొలిదశలో గొంతు నొప్పి, ముక్కు దిబ్బెడ కనిపిస్తున్నాయన్నారు. ఇలాంటి లక్షణాలే యూకేలో ఒమిక్రాన్‌ సోకిన వారిలో కూడా ఉన్నాయని వివరించారు. అక్కడి వారిలో తలనొప్పి, అలసట వంటి లక్షణాలు అదనంగా కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. యూకేలో డిసెంబర్‌  3వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య జరిగిన విశ్లేషణలో వీటిని గుర్తించారు.  ఇటువంటి లక్షణాలే సహజంగా జలుబులో కూడా కనిపిస్తాయి. 

ఇక యూకేలోని ‘జో సిమ్టమ్‌ ట్రాకింగ్‌ స్టడీ’లో కొన్ని లక్షణాలు గుర్తించారు. ముక్కు కారడం, తలనొప్పి వంటిలక్షణాలు స్వల్పంగా లేదా తీవ్రంగా ఉంటున్నట్లు తేలింది. అంతేకాదు.. తుమ్ములు, గొంతు నొప్పి కూడా ఉన్నట్లు పరిశోధకులు గమనించారు. కరోనా వైరస్‌ డెల్టా వేరియంట్‌తో పోలిస్తే..ఒమిక్రాన్‌ లక్షణాలు భిన్నంగా ఉన్నాయి. డెల్టా సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, పొడి దగ్గు, అలసట, రుచి-వాసన కోల్పోవడం, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వంటివి కనిపించాయి. 

జో కొవిడ్‌ స్టడీ ప్రధాన శాస్త్రవేత్త టిమ్‌ స్పెక్టర్‌ మాట్లాడుతూ.. ‘‘ ఒమిక్రాన్‌ సోకిన వారికి జలుబు లక్షణాలే ఎక్కువ ఉంటున్నట్లు మా పరిశోధనలో తేలింది. ఇటువంటి లక్షణాలు ఉన్న వారు ఇళ్లలోనే ఉండండి.. కొవిడ్‌ కావచ్చు. బూస్టర్‌ డోసులు తీసుకొన్న  వారిలో అతి స్వల్ప లక్షణాలతో కొవిడ్‌ సోకినట్లు గమనించాము’’ అని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని