Sourav Ganguly: త్రిపుర బ్రాండ్ అంబాసిడర్‌గా గంగూలీ.. దాదా రాజకీయ అరంగేట్రంపై మళ్లీ చర్చ

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ (Sourav Ganguly) రాజకీయ అరంగేట్రంపై మరోసారి చర్చ మొదలైంది. ఆయన త్రిపుర బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులవడమే అందుక్కారణం.

Updated : 24 May 2023 11:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ (BCCI) మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ (Sourav Ganguly) సరికొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. ఈశాన్య రాష్ట్రం త్రిపుర (Tripura) పర్యాటక శాఖకు ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌ (brand ambassador)గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా ప్రకటించారు.

త్రిపుర పర్యాటక శాఖ మంత్రి సుశాంత చౌధరీ మంగళవారం కోల్‌కతాలోని గంగూలీ (Sourav Ganguly) నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. అటు సీఎం మాణిక్‌ సాహా కూడా గంగూలీతో ఫోన్‌లో మాట్లాడి బ్రాండ్ అంబాసిడర్‌ బాధ్యతలను ఆఫర్‌ చేశారు. అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ‘‘టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీజీ మా ప్రతిపాదనను అంగీకరించి త్రిపుర టూరిజానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాధ్యతలు చేపడుతుండటం మాకు గర్వకారణం. ఆయన రాకతో మా రాష్ట్ర పర్యాటక రంగం మరింత వెలుగొందుతుంది’’ అని సీఎం సాహా ట్విటర్‌లో రాసుకొచ్చారు.

అయితే, ఈ ప్రకటనతో దాదా రాజకీయ అరంగేట్రంపై మరోసారి చర్చ మొదలైంది. త్రిపురలో భాజపా (BJP) ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ రాష్ట్ర పర్యాటక శాఖకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా గంగూలీ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్త రాగానే.. పశ్చిమ బెంగాల్‌లోని భాజపా కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. దీంతో దాదా కాషాయ పార్టీలో చేరుతారని మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి.

దాదా రాజకీయ అరంగేట్రంపై చర్చ మొదలైందిలా..

2019లో గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయన రాజకీయాల్లోకి రానున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. దాదా భాజపా (BJP)లో చేరనున్నారని, బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నేరుగా పోటీకి దిగనున్నారని అప్పట్లో సోషల్‌మీడియా కోడై కూసింది. దీనికి తోడు 2021లో గంగూలీ అనారోగ్యానికి గురైనప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన ఇంటికి వెళ్లి మరీ పరామర్శించడం ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చింది. అయితే, అనుకున్నట్లుగా అప్పుడు ఆయన భాజపాలో చేరలేదు.

ఇదిలా ఉండగా.. గతేడాది బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ పదవీకాలం ముగిసినప్పుడు దాన్ని మరోసారి పొడగించలేదు. దీంతో భాజపాలో చేరలేదన్న కక్షతోనే ఆయన పదవీకాలాన్ని పొడగించలేదని టీఎంసీ ఆరోపించింది. ఆ తర్వాత దాదా రాజకీయాలపై మరోసారి చర్చ తెరపైకి వచ్చింది. గతేడాది గంగూలీ.. మమతా బెనర్జీతో సమావేశమవ్వడం, దుర్గాపూజకు వారసత్వ హోదా రావడంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయనను ముఖ్య అతిథిగా దీదీ ప్రభుత్వం ఆహ్వానించడం.. వంటి పరిణామాలు వీటికి ఆజ్యం పోశాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ఆయనకు జెడ్‌ కేటగిరీ భద్రతను కేటాయించడంతో ఆయన టీఎంసీ (TMC) పార్టీకి దగ్గరవుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే త్రిపుర పర్యాటక శాఖకు ఆయనను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని